ప్రజాశక్తి-పెందుర్తి : బిజెపి ప్రభుత్వం మహిళా చట్టాలకు తూట్లు పొడుస్తోందని ఐద్వా నాయకులు బి.రమణి విమర్శించారు. పెందుర్తిలోని సిఐటియు కార్యాలయంలో సోమవారం మహిళా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సోషల్ మీడియా అభివృద్ధి చెందాక మహిళలను అశ్లీలంగా చూపడం ఎక్కువైందన్నారు. ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిసైనా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని విమర్శించారు. మహిళలు ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి వెళ్లే వరకు భయంతోనే ఉండాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల హింసపై ఐద్వా ఆధ్వర్యాన ఈ నెల 28 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు చేపట్టే పోరు యాత్రను జయప్రదం చేయాలని కోరారు.
ఐద్వా నాయకులు లీల మాట్లాడుతూ, తెలంగాణలో ప్రియాంక ఘటన ప్రజలను కలిసి వేసిందన్నారు. మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించే చట్టాలను అమలు చేయాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ జరిపి నిందితులకు కఠినమైన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. మహిళలందరూ ఐక్యంగా పోరాటం చేయడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐదవ జోన్ కార్యదర్శి వెంకటలక్ష్మి, రజని, సిఐటియు నాయకులు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.










