ప్రజాశక్తి-గుంటూరు : బిజెపి విధానాలతో భారతదేశం ప్రమాదంలో ఉందని మాజీ ఎంపి పి.మధు అన్నారు. మతంతో సంబంధం లేకుండా ప్రజలంతా ఐకమత్యంతో కేంద్రం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఆవాజ్ ఆధ్వర్యంలో ముస్లిం, ఇతర మతాల ప్రజల మధ్య ఐకమత్యానికి చిహ్నంగా స్థానిక బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రాత్రి ఈద్ మిలాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎస్.కె.బాషా అధ్యక్షత వహించారు. మధు మాట్లాడుతూ బిజెపి పాలనలో మైనార్టీలే కాకుండా దేశమే ప్రమాదంలో పడిందన్నారు. ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థ, లౌకిక తత్వం, రాజ్యాంగాన్ని బిజెపి ధ్వంసం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతూ సామాన్యులపై భారాలు మోపుతున్నారన్నారు. పాలు, పెరుగు, బియ్యంపైనా పన్ను విధించటం గతంలో ఎప్పుడూ లేదన్నారు. ఒకే దేశం ఒకే పన్ను పేరుతో కార్పొరేట్లకు, సామాన్యులకు ఒకే విధమైన పన్నుల విధానం అమలు చేయటం అన్యాయమని చెప్పారు. దళితులు, గిరిజనుల రిజర్వేషన్లు, స్కాలర్‌షిప్పులు కుదిస్తున్నారని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బిజెపికి రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన లొంగిపోయిన దేశాన్ని రక్షించుకోవటానికి నేపథ్యంలో ప్రజలు ఐక్యంగా పోరాడాలని కోరారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు సిఎస్‌ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ముస్లిములు, ముస్లిమేతరుల మధ్య ఐక్యతకు గుర్తుగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించటం అభినందనీయమన్నారు. ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.ఎ.చిష్టీ మాట్లాడుతూ దేశంలో మైనార్టీలపై సాంస్కృతిక దాడి జరుగుతోందని ఆందోళన వెలిబుచ్చారు. ప్రజలంతా సమానమేనని ఇస్లాం చెబుతుందని, రంజాన్ సందేశాన్ని అర్థం చేసుకొని ఐకమత్యంతో మెలగాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ మతం వ్యక్తిగతమని, తన మతమే గొప్పదని, ఇతర మతాలు తక్కువనే భావజాలం కలిగిన మతత్వం, మతోన్మాద విధానాలు ప్రమాదకరమని అన్నారు. ప్రజల మధ్య మతోన్మాద చిచ్చు రేపుతున్న బిజెపి విధానాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్‌కె.బాషా మాట్లాడుతూ 2002 నుండి ఆవాజ్ సంస్థ ముస్లిం మైనార్టీల అభివృద్ధి, భద్రత, లౌకిక వాదం పరిరక్షణకు కృషి చేస్తుందని చెప్పారు. ముస్లిమ్ ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ కలాం, సమాచార హక్కు చట్టం కార్యకర్త షేక్.బాజి, నో అవర్ హిస్టరీ ఛైర్మన్ సూఫీ ఇమ్రాన్, అల్లాబక్షు, బిఎస్‌పి నాయకులు వాసు, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్, పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జి.ప్రభుదాసు పాల్గొన్నారు.










