ఆప్ కూడా ఆర్‌ఎస్‌ఎస్ నుంచే పుట్టింది
పంజాబ్‌లో ప్రియాంక ఘాటు విమర్శలు
కొత్కాపుర : బిజెపితో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ కుమ్మక్కయ్యారని, ఢిల్లీ నుంచి బిజెపి ద్వారా ప్రభుత్వాన్ని నడిపించినందునే సిఎం పదవి నుంచి తొలగించామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలిపారు. ఆప్ కూడా ఆర్‌ఎస్‌ఎస్ నుంచే పుట్టుకొచ్చిందని, ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ఈ నెల 20న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 'నవీసోచ్, నవ పంజాబ్' పేరుతో ఆదివారం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలో ఐదేళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా. మధ్యలో దారి తప్పిపోయిందని, ఢిల్లీలో బిజెపి ద్వారా ప్రభుత్వం నడిచిందని తెలిపారు. 'ఆ బంధం ఈ రోజు బయటకొచ్చింది. అందుకే దాన్ని తొలగించాం' అని చెప్పారు. ఢిల్లీ మోడల్ అంటూ ప్రచారం చేస్తున్నారని, ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆప్ నేతృత్వంలో ఢిల్లీలో విద్య, ఆరోగ్య సంరక్షణ సంస్థల పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ చేయలేదని చెప్పారు. రాజకీయ పార్టీలు, ఆ నేతల గురించిన వాస్తవాలను ప్రజలు తెలుసుకోవడం ముఖ్యమని చెప్పారు. ఢిల్లీ మోడల్‌ని పంజాబ్‌కి తీసుకొస్తామని ఆప్ పదేపదే చెబుతోందని, ఢిల్లీలో ప్రచారం తప్ప మరేమీ లేదని అన్నారు. 2014లో బిజెపి కూడా దేశంలో గుజరాత్ మోడల్‌ని తీసుకొస్తామంటూ అసత్యాలు చెప్పి ప్రజల్ని మోసం చేసిందని, ఆప్ కూడా అదే చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన చన్ని సామాన్యమైన వ్యక్తేనని .. మీలో ఒకరని పేర్కొన్నారు.
భవిష్యత్ తరం కోసం పోరాటం : సిద్ధూ
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము భవిష్యత్ తరం కోసం పోరాటం చేస్తున్నామని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షులు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ తెలిపారు. ఆమృత్‌సర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సిద్ధూ ఈ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లో ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడించనున్నారు.










