
బిజెపిని వ్యతిరేకించే వారికే మద్దతు
- సిపిఎం ప్రణాళికను ఆదరించాలి
- సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్
ప్రజాశక్తి - నందికొట్కూరు టౌన్/ఆత్మకూరు
బిజెపికి వ్యతిరేకంగా పోరాడే వారికి మద్దతు ఇస్తామని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ. గఫూర్ పిలుపునిచ్చారు. సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర మంగళవారం రెండో రోజు నంద్యాల జిల్లాలో సాగింది. నందికొట్కూరు, ఆత్మకూరు మీదుగా నంద్యాల వరకు సాగిన యాత్ర అనంతరం కడప జిల్లాలోకి ప్రవేశించింది. తొలుత సిపిఎం ప్రజా రక్షణ బేరి బస్సు యాత్ర కర్నూలు నుండి నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చేరుకుంది. యాత్ర బంద సభ్యులకు సిపిఎం నాయకులు ఘన స్వాగతం పలికారు. బస్టాండ్ నుంచి పటేల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పటేల్ సెంటర్లో సభ నిర్వహించారు. అనంతరం యాత్ర ఆత్మకూరుకు చేరుకుంది. చక్రం హోటల్ నుంచి పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరులో చిన్నారులు ప్రదర్శించిన కోలాటం అందరిని ఆకట్టుకుంది. నందికొట్కూరు, ఆత్మకూరులో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకుండా నిర్బంధం ప్రదర్శిస్తున్నారన్నారు. ఇందిరా గాంధీనే ఓడించిన ప్రజలకు జగన్ ఎంత అని వ్యాఖ్యానించారు. కార్పొరేషన్లకు నిధులు లేకుండా ఎలా అభివద్ధి చెందుతారన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే ఎప్పుడు వస్తారో తెలియదని, ఆత్మకూరుకు ఏమి అభివద్ధి జరిగిందో చెప్పండని ప్రశ్నించారు. నవంబర్ 15న విజయవాడలో బహిరంగ సభ నిర్వహించి ప్రజా ప్రణాళికను విడుదల చేస్తున్నామని, దానిని ప్రజలందరూ బలపరచాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని చెప్పేందుకే బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు. నందికొట్కూరులో సిపిఎం రాష్ట్ర నాయకులు శివ నాగరాణి, ఉమా మహేశ్వర రావు, ఆత్మకూరులో దయా రమాదేవి, భాస్కరయ్య మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేస్తూ, కార్మిక హక్కులను కాలరాస్తూ పెట్టుబడుదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఉద్యోగులకు, ఉద్యోగ భద్రత లేకుండా కార్మికులను నయా బానిసలుగా చేసే విధానాలను తీసుకువస్తుందని, విద్యుత్ డిస్కంలను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పి ప్రజలపైన మోయలేని భారాలను విధిస్తుందన్నారు. నందికొట్కూరు సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరరావు, ఆత్మకూరు సభకు సిపిఎం జిల్లా నాయకులు స్వామన్న అధ్యక్షత వహించారు. బస్సు యాత్రలో సీపీఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏసురత్నం, సీనియర్ నాయకులు ఏ.రాజశేఖర్, ఆత్మకూరు పట్టణ కార్యదర్శి రణధీర్, జిల్లా నాయకులు నరసింహా నాయక్ పాల్గొన్నారు.
బస్సు యాత్ర బందానికి వినతులు...
బస్సు యాత్ర బందానికి పలువురు వినతి పత్రాలు సమర్పించారు. నందికొట్కూరు బిఆర్ ఆర్ నందు కొట్టాలు వేసుకున్న గుడిసె వాసులకు పట్టాలు ఇప్పించాలని వినతిపత్రాన్ని సమర్పించారు. మిడుతూరు మండలంలో భూమి పట్టాలు ఇచ్చారు కానీ భూములను చూపించాలని, నందికొట్కూరు మున్సిపాలిటీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు. అంగన్వాడి, ఆశవర్కర్ల సమస్యలను పరిష్కరించా లని, డప్పు కళాకారులకు గుర్తింపు కార్డు, రూ.5వేల పింఛన్ ఇవ్వాలని వినతి పత్రాలు సమర్పించారు.
