రాయచోటి టౌన్ ; కడప ఉక్కు పరిశ్రమ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ముందుగా కలెక్టర్ కార్యాలయం గేటు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన ఆద్యంతం బిజెపి విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ.రామాం జులు అధ్యక్షతన జరిగిన ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతాల్లో సున్నపురాయి మొదలు విలువైన ఇనుము, అత్యంత విలువైన డోలమైట్, బంగారం, వజ్రాలు లాంటి 64 రకాల ఖనిజల నిక్షేపాలు ఉన్నాయని చెప్పారు. వీటి ఆధారంగా పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కలిపించి, కరువు నుంచి శాశ్వత విముక్తి చేయాలనేది ప్రజల కోరిక అని వివరించారు. అప్పట్లో రాజశేఖరరెడ్డి నుంచి నేటి జగన్ మోహన్ రెడ్డి వరకు నాలుగు సార్లు శంకుస్థాపన చేసిన కడప ఉక్కు పరిశ్రమ ప్రారంభం కాకపోవడం దుర్మార్గమన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు పరుస్తామని బిజెపి హామీ ఇచ్చిందని చెప్పారు. విభజన చట్టం రూపొందించి పది సంవత్సరాలు పూర్తయింది కాని ఒక్క హామీ పూర్తిగా అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బిజెపి పార్టీ తరుపున కర్నూలులో రాయలసీమ డిక్లరేషన్, కడపలో రాయలసీమ రణభేరి అంటూ సభలు నిర్వహించి మాటల గారడి చేసిందని ఆరోపించారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడంతోనే కడప ఉక్కు పరిశ్రమ స్థాపించడం సాధ్యం కాదని బిజెపి ప్రభుత్వం నిసిగ్గుగా ప్రకటించిందని వాపోయారు. ప్రభుత్వ రంగంలో లాభదాయకం కాని ఉక్కు పరిశ్రమ, ప్రయివేట్ జిందాల్ కంపెనీకి ఎలా లాభదా యకం అవుతుందో బిజెపి వారికే తెలియాలని ఎద్దేవా చేశారు. సెయిల్ అధ్య యనం చాటున తన చేతికి రక్తపు మరకలు అంటకుండా కడపఉక్కును, రాయల సీమ యువత ఆశలను బిజెపి హత్య చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం లో అధికారానికి పోటీ పడుతున్న వైసిపి, టిడిపి పార్టీలు ఉక్కు పరిశ్రమను సాధించడంలో ఘోరంగా విఫలమయ్యాయని చెప్పారు. తమ పార్టీకి 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్నా జగన్ మోహన్ రెడ్డి కేంద్రం ముందు నడుములు వంచి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాడని విమర్శిం చారు. కొత్త రాజకీయాలు అంటూ రంకెలు వేస్తున్న జనసేన నేత ఏకంగా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపి భజనలో తరిస్తున్నాడు తెలిపారు. విభజన చట్టంలో భాగంగా ఉన్న కడప ఉక్కు సాధించడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని అందుకు అధికార వైసీపి చొరవ చూపాలని రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలు, ప్రజాతంత్రవాదులు, యువత పెద్ద సంఖ్యలో సమీకరించి ఉద్యమం ఉధతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు రవి కుమార్, వెంకట్రామయ్య, ప్రభాకర్ రెడ్డి, నరసింహ, బసిరెడ్డి, జయరామయ్య, వెంకటేష్, సురేంద్ర, ఫయాజ్, మెహరాజ్, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.










