Nov 13,2023 20:36

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌

 కడప అర్బన్‌ రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని ప్రశ్నించే సాహసం వైసిపి, టిడిపి జనసేన చేయడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. సోమవారం పాత బస్టాండ్‌ లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 15న 'చలో విజయవాడ ప్రజా రక్షణ భేరి' లక్ష మందితో నిర్వహించే ''బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్నికలు నాలుగు నెలల్లో రానున్నాయని పేర్కొన్నారు. వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు అవకాశవాద రాజకీయ ఎత్తుగడలు అవలంభిస్తున్నాయని తెలిపారు. ప్రజల సమస్యలపై అజెండా, రాష్ట్రలో అసమానతలు లేని సమగ్రాభివద్ధి, కేంద్రం రాష్ట్రానికి చేసిన ద్రోహంపై ఎన్నికల ప్రణాళికలో మూడు పార్టీలకు లేవని తెలిపారు. దేశంలో బిజెపి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం రాజకీయ విలువలను నడి బజారులో ఇప్పేస్తున్న రాష్ట్రంలోని అధికార వైసిపి ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించ కుండా ఉందో ప్రజలందరూ ఆలోచించాలన్నారు. బిజెపి బాటలోనే వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో నియంతత్వ పోకడలతో పాలిస్తోందని విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మోడీ, అమిత్‌ షా, నడ్డా నాయకత్వంలోని కేబినెట్‌ మంత్రులు, దేశంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులను, ప్రాంతీయ పార్టీల నాయకులను భయపెట్టి కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలైన ఐటి, సిబిఐ, ఈడి దాడులు చేస్తామని బెదిరిస్తూ బిజెపిలోకి చేరమని థాయిలాలు చూపుతున్నారన్నారు. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన ఏడు రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు బిజెపిలో గుత్త మొత్తంగా చేరిన ఉదాంతాలు దేశం ముందుకు వచ్చి ఉన్నాయన్నారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేనలను కూడా ఆ పద్ధతుల్లోనే భయపెట్టి రాష్ట్రంలో చాపకింద నీరు లాగా బిజెపి బలపడుతుందని హెచ్చరించారు. బహిరంగ సభకు జిల్లా నుంచి వందలాది మంది ప్రజలు వెళ్ళనున్నారని తెలిపారు. సభకు అఖిలభారత సిపిఎం కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలు ప్రజా సమస్యలపై ప్రధాన అజెండాగా ఉండేలా 'ప్రజాస్వామ్య వేదిక' ఏర్పాటుకు ప్రజలందరూ సహకరించేందుకు ప్రజా చైతన్యం సిపిఎం కల్పిస్తుందని చెప్పారు. బిజెపిని, దాని మిత్రులను ప్రజలు దూరంగా పెట్టేందుకు నిర్ణయించేకునేలా ప్రయత్నిస్తోందన్నారు. ఈ ప్రయత్నానికి రాష్ట్రంలోని వామపక్ష పార్టీలు, ప్రజాస్వామ్య మేధావులు, లౌకిక , ప్రజాస్వామ్య, సామ్యవాద, మధ్య తరగతి ప్రజల సమస్యలపై నిరంతరం పనిచేసే ప్రజాసంఘాలు సహకరించాలని కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మనోహర్‌, ఏ.రామ్మోహన్‌, కమిటీ సభ్యులు కె.శ్రీనివాసులు రెడ్డి, బి.దస్తగిరి రెడ్డి పాల్గొన్నారు.