Apr 24,2023 23:18

సభకు హాజరైన జనం, మాట్లాడుతున్న కె.రామకృష్ణ (ఇన్‌సెట్‌)

ప్రజాశక్తి - మంగళగిరి : దేశ ప్రజల మధ్య చిచ్చులు పెడుతున్న బిజెపిని సాగనంపాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బిజెపిని సాగనంపుదాం-దేశాన్ని కాపాడుకుందాం పేరుతో మంగళగిరి పట్టణంలో సిపిఎం, సిపిఐ పట్టణ కమిటీల ఆధ్వర్యంలో ప్రచారభేరి ముగింపు సందర్భంగా బహిరంగ సభను పట్టణంలోని ఆటో నగర్‌లో సోమవారం నిర్వహించారు. సభకు సిపిఎం పట్టణ కార్యదర్శి వై.కమలాకర్‌, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య అధ్యక్షత వహించారు. బివి రాఘవులు మాట్లాడుతూ బిజెపిని నమ్మితే రాజకీయ పార్టీలకే కాకుండా ప్రజలకు బతుకు లేకుండా చేస్తుందని అన్నారు. ఫెడరలిజంపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందని, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. దేశానికి చేటుతెచ్చే ఈ విధానాలపై ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకష్ణ మాట్లాడుతూ కష్టజీవులు ఉన్నంతకాలం కమ్యూనిస్టులు ఉంటారని, పేదల కోసం నిరంతరం పనిచేస్తారని అన్నారు. తొమ్మిదేళ్ల మోడీ పాలనలో దేశం ఆర్థికంగా చతికిలపడిందని విమర్శించారు. 2014కు ముందు ఉన్న ప్రధానులందరూ రూ.47 లక్షల కోట్ల అప్పు చేస్తే మోడీ ఒక్కరే రూ.కోటిన్నర లక్షల కోట్లు అప్పు చేశారని తెలిపారు. ప్రజలకు ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలోని జగన్‌మోహన్‌రెడ్డి పాలనా దుర్మార్గంగా ఉందన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా పాలిస్తున్నారని, దళితులపై దాడులు పెరిగిగాయని అన్నారు. రానున్న కాలంలో రాష్ట్రంలో అన్ని ప్రజా సమస్యలపై కమ్యూనిస్టులు, ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు కలిసి పని చేస్తారని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబురావు మాట్లాడుతూ బిజెపి, వైసిపి పాలనలో అభివృద్ధి కనబడడం లేదన్నారు. మోడీ, జగన్మోహన్‌రెడ్డి ఉమ్మడిగా ఉంటూ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని విమర్శించారు. చెత్తపై పన్ను వేసిన ఘనత వైసిపికే దక్కుతుందని, విద్యుత్‌ ఛార్జీలను పెంచారని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజా పోరాటాలను ఉధృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో 25 వేల మంది పేదలు ప్రభుత్వ భూముల్లో ఇళ్లేసుకుని నివాసం ఉంటున్నారని, వారికి పట్టాలివ్వకుంటే ఉధృత ఉద్యమాలు చేస్తామని అన్నారు. రాజధాని ప్రాంతంలో 5వేల టిడ్కో గృహాలు నిర్మించినా పేదలకు ఇవ్వలేదని విమర్శించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్‌ మాట్లాడుతూ మతోన్మాద బిజెపి విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, లౌకికశక్తులు సంఘటితమై ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సి ఉందని అన్నారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య మాట్లాడుతూ మంగళగిరి పరిసర ప్రాంతాల్లో సిపిఎం, సిపిఐ ప్రజా ప్రతినిధులుగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధిని వివరించారు. సభలో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, ఎం.రవి, సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు, జొన్న శివశంకర్‌రావు, తాడేపల్లి పట్టణ, రూరల్‌ కార్యదర్శులు బి.వెంకటేశ్వర్లు, డి.వెంకటరెడ్డి, దుగ్గిరాల మండల కార్యదర్శి జె.బాలరాజు, మంగళగిరి నాయకులు వి.వి జవహర్లాల్‌, నాయకులు బి.కోటేశ్వరి, పి.బాలకృష్ణ, సిపిఐ నాయకులు కె.కాశియ్య, జె.జాన్‌బాబు, చిన్ని సత్యనారాయణ, పి.నాగేశ్వరరావు, వై.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి, ప్రజానాట్యమండలి కళాకారులు విప్లవ గేయాలను ఆలపించారు. సిపిఎం పట్టణ నాయకులు షంషేర్‌ ఖాన్‌ చిత్రపటానికి సిహెచ్‌ బాబురావు, ముప్పాళ్ల నాగేశ్వరరావు పూలమాలలేసి నివాళులర్పించారు.