Oct 13,2023 19:22

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌

బిజెపిని గద్దె దింపుదాం
- దేశాన్ని రక్షించుకుందాం
- సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌
ప్రజాశక్తి - నందికొట్కూరు టౌన్‌

    ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్రంలోని బిజెపిని గద్దె దించి ప్రత్యామ్నాయ ఇండియా కూటమిని గెలిపిద్దామని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం నందికొట్కూరు పట్టణంలోని సాయిరాం కాలేజీలో సిపిఎం నాయకులు కె.భాస్కర్‌ రెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అన్నారు. ప్రజలపై విచ్చలవిడిగా భారాలు మోపి పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందని విమర్శించారు. 2014లో బిజెపి అధికారంలోకి రాకముందు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 9 సంవత్సరాలు అవుతున్నా ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేసి ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతుందని అన్నారు. వంద రోజుల్లో ధరలు అరికడతామని చెప్పి నేడు పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌, విద్యుత్తు నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా నియంత్రించడంలో ప్రధాని మోడీ ఘోరంగా వైఫల్యం చెందారని తెలిపారు. రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని చెప్పిన మోడీ నేడు రైతుల అప్పులను, ఆత్మహత్యలను రెట్టింపు చేశారని విమర్శించారు. నల్లధనాన్ని వెలికి తీసి అవినీతిని అరికడతానని, ప్రజల ఖాతాల్లో జమ చేస్తానని మాయమాటలు చెప్పిన నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసి రూ. 2 వేలు నోటు తెచ్చారని, నేడు అవి చలామణిలో లేకుండా పోయాయని చెప్పారు. జిఎస్‌టి పేరుతో సామాన్య ప్రజలపైన విపరీతమైన భారాలు మోపుతూ రాష్ట్రాలకు రావాల్సిన జిఎస్టి నిధులను కూడా రాకుండా కేంద్రం పెత్తనం చేస్తుందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకపోగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిన మోడీకి రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు గులాంగిరి చేస్తున్నాయని విమర్శించారు. బిజెపి విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం ప్రత్యామ్నాయ రాజకీయ విధానం కోసం రాష్ట్రవ్యాప్తంగా మూడు బస్సుజాతాలు నిర్వహిస్తుందని, ఈ నెల 23వ తేదీ నందికొట్కూరుకు వచ్చే బస్సు జాతాను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు, నాయకులు శ్రీనివాసులు, టి ఓబులేష్‌, ఫకీరు సాహెబ్‌, టి గోపాలకృష్ణ, ఈశ్వరమ్మ, హుస్సేనమ్మ, ఆంజనేయులు, బేస్తరాజు, నాగన్న, ఎం కర్ణ, జయమ్మ, రంగమ్మ, లింగస్వామి, బాలకృష్ణ, నరసింహులు, ఏసన్న, వెంకటేశ్వర్లు, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.