
బిజెపిని గద్దె దింపాలి
'ప్రజారక్షణ భేరి' పిలుపు
ప్రజాశక్తి - విజయవాడ, తిరుపతి బ్యూరో
వచ్చే ఏడాది 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని గద్దె దించకపోతే ఈ దేశానికే ప్రమాదమని సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జాతీయ, రాష్ట్ర నాయకులు బివి రాఘవులు, పుణ్యవతి, ఎంఎ గఫూర్, పి.మధు, డి.రమాదేవి పిలుపునిచ్చారు. సిపిఎం ప్రజారక్షణ భేరి బహిరంగసభ బుధవారం విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎంబి స్టేడియంలో జరిగింది. లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రానికి కావాలంటూ విజయవాడ నుంచి సిపిఎం నాయకులు సమరభేరి మోగించారు. విజయవాడ కేంద్రంగా బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన మహా ప్రదర్శన, భారీ బహిరంగ సభకు తిరుపతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున నాయకులు హాజరయ్యారు. జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆధ్వర్యంలో మహా ప్రదర్శనలో పాల్గొన్నారు. జానపద వృత్తి కళాకారులు ప్రదర్శనలతో మోడీ, జగన్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. సిపిఎం జిల్లా నేతలు కందారపు మురళి, అంగేరి పుల్లయ్య, దాసరి జనార్ధన్, టి. సుబ్రమణ్యం, ఒ.వెంకటరమణ, గంధం మణి, పెనగడం గురవయ్య, వేణు, సంక్రాంతి వెంకటయ్య, రాపూరు సుబ్రమణ్యం, ముకుంద తదితరులు పాల్గొన్నారు. తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, పుత్తూరు, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట కేంద్రాల నుంచి వందలాది మంది పార్టీ శ్రేణులు, సానుభూతిపరులు మహార్యాలీలో పాల్గొన్నారు.
విజయవాడలో జరిగిన మహాప్రదర్శనలో తిరుపతి జిల్లా సిపిఎం నేతలు, అభిమానులు