ప్రజాశక్తి - చిలకలూరిపేట : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించటానికి కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, అన్ని రంగాల ప్రజలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. విజయవాడలో ఈనెల 9న నిర్వహించే కార్మిక సంఘాల మహా ధర్నా విజయవంతం కోసం పట్టణంలో ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్‌ఆర్‌టి సెంటర్ నుండి బయలుదేరిన ర్యాలీ భాస్కర్ సెంటర్, చౌత్ర సెంటర్, మెయిన్ బజార్, గడియార స్తంభం, కళామందిర్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బిజెపి విధానాలతో కార్మికులు, ప్రజలు అసంతృప్తి చెందారని, దీన్ని పక్కదారి పట్టించటానికి మత చిచ్చు పెడుతున్నారని, మణిపూర్, హర్యానాలో అల్లర్లు ఇందులో భాగమని వివరించారు. మైనార్టీలు, దళితులు, గిరిజనులు, మహిళలు, ఇతర సామాజిక తరగతులపై సంఘపరివార్ శక్తులు నిత్యం దాడులు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను, సహజ వనరులను కార్పొరేట్లకు దోడిపెడుతున్నారని, వ్యవసాయాన్నీ వారికే అపపగించేయందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇదే జరిగితే దేశంలో ఆహార సంక్షోభం వస్తుందని హెచ్చరించారు. ప్రజలకు సబ్సిడీలను ఎత్తేస్తున్న ప్రభుత్వం కార్పొరేట్లకు మాత్రం పన్ను రాయితీలు ఇస్తోందని విమర్శించారు. అయితే రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు కేంద్రానికి వంతపాడుతున్నారని, విద్యుత్, మున్సిపల్, సహకర, విద్య, రవాణ రంగాల్లో ప్రమాదకర సంస్కరణను కేంద్రం ఆదేశాలతో రాష్ట్రంలోని వైసిపి అమలు చేస్తూ ప్రజలపై భారాలు వేస్తోందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే మరోవైపు ప్రజల ఆదాయాలు పడిపోతున్నాయని, ఇదే విధానాలను కొనసాగిస్తే దేశం అదోగతి పాలువుతుందని, అందుకే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్నారు. కార్యక్రమంలో ఎఐటియుసి, సిఐటియు, ఇతర ప్రజా సంఘాల నాయకులు ప్రతాపరెడ్డి, పి.వెంకటేశ్వర్లు, ఎన్.రామసుబ్బాయమ్మ, టి.బాబురావు, పి.రామారావు, జి.భగత్‌సింగ్, స్థాలిన్, ఎం.విల్సన్, ఫైరోజ్, బి.భగత్‌సింగ్, ఎం.వెంకటేశ్వర్లు, జి.నాగయ్య, చెంచయ్య, ఎ.పోతురాజు, ఎన్.శివకుమార్ పాల్గొన్నారు.










