సిపిఎం, సిపిఐ ప్రచార భేరిలో నేతలు
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
ప్రజల సంపదను కొల్లగొట్టి అదానీ, అంబానీలకు దోచిపెడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని సిపిఎం, సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం సిపిఎం, సిపిఐ ప్రచార భేరి యాత్ర ముగింపు సందర్భంగా స్థానిక పాత పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన సభకు సిపిఎం మండల కార్యదర్శి ఎం.జీవరత్నం, సిపిఐ మండల కార్యదర్శి రమణరాజు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథులు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, సిపిఐ జిల్లా కార్యదర్శి మనవ కృష్ణచైతన్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ప్రజల సంపదను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసారని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలన్నీ అంబానీ, అదానీలకు కట్టబెట్టడం కోసం పేదలపై పన్ను భారాలు వేసి లక్షల కోట్లు పన్ను రాయితీలు కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ధరలు తగ్గించాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు కోసం పోటీ పడుతున్నారని, వీరికి మోడీ భజన తప్ప పేదల బాగోగులు పట్టడం లేదని విమర్శించారు. ఇకనైనా ఈ మూడు పార్టీలు నోరు విప్పి కేంద్రం నుండి రాష్ట్రానికి రావలసిన నిధులు, హామీల అమలు కోసం వామపక్షాలతో కలిసి పోరాటాలకు మద్దతు తెలపాలని కోరారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో రైతులను, కార్మికులను, వ్యవసాయ కూలీలను ఐక్యం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సభలో సిపిఎం నేతలు అందుగుల ప్రభాకర్, జోడి సూర్యచంద్రరావు, జి.సూర్యకిరణ్, ఆర్.దుర్గారావు, వై.సీత, బి.రాంబాబు, పి.సూర్యారావు, సిహెచ్.మాణిక్యాలరావు, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిత సురేష్, తోర్లపాటి బాబు, చాకిరి సురేష్, ఎ.సూర్యచంద్ర, సుంకర రాధాకృష్ణ, చిట్టూరి వెంకటేశ్వరరావు, కె.శ్రీరాములు పాల్గొన్నారు.
పెదవేగి : మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్, సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం దెందులూరు నియోజకవర్గంలో కేంద్రంలో మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన చేపట్టిన ప్రచార భేరి యాత్ర రెండో రోజు ముండూరు, లక్ష్మీపురం, వేగివాడ గ్రామాల మీదుగా సాగింది. ముండూరులో ఆరబెట్టిన మొక్కజొన్న పంటను నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతుల పంటలకు మద్దతు ధర కల్పిస్తూ మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తేవాలని కోరారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించవద్దని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వ రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేత ఎ.శ్యామలారాణి, సిపిఐ నేత పొటేలు పెంటయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.
దెందులూరు : రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను మోడీకి తాకట్టుపెట్టి కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లి వైసిపి, టిడిపి, జనసేన కేంద్రంతో దోస్తీ చేస్తూ రాష్ట్రంలో కుస్తీలు పడుతున్నాయని సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్ విమర్శించారు. ప్రచార భేరి యాత్ర సోమవరప్పాడులో ప్రారంభించారు. గోపన్నపాలెం, గాలాయగూడెం, నాగుల దేవునిపాడు, గంగన్నగూడెం, మేదినరావుపాలెం, రామారావుగూడెం, శ్రీరామవరం, దెందులూరు, పోతునూరు, దోసపాడు, కొవ్వలి గ్రామాల మీదుగా యాత్ర సాగింది.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆపాలని, కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరారు.
ముసునూరు : బిజెపి స్వార్థ రాజకీయాలను తిప్పికొట్టాలని రైతుసంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నర్సింహా అన్నారు. సిపిఎం, సిపిఐ ప్రచార భేరి మండలంలో సాగింది. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నాయకులు పి.జమలయ్య, నేతలు బత్తుల వెంకటేశ్వరరావు, పిల్లి మురళీ, చాట్ల పుల్లారావు, కొల్లి శ్రీను, ఓరుగు శ్రీనివాసరావు పాల్గొన్నారు.










