Aug 11,2023 20:51

సమావేశంలో మాట్లాడుతున్న ఎన్‌.తులసిరెడ్డి

చెన్నూరు : ఆంధ్రప్రదేశ్‌కు బిజెపి ఒక శని గ్రహంలా, వైసిపి, టిడిపిలు రాహు కేతువులుగా దాపురించాయని కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు, పిసిసి మీడియా చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కమలాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశానికి తీరని ద్రోహం చేసిందన్నారు. రాష్ట్రానికి సంజీవిని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టిందన్నారు. జిల్లాలోని స్టీల్‌ ప్లాంట్‌కు స్వస్తి పలకడంతో పాటు దుగరాజపట్నం ఓడరేవు ఊసే లేదన్నారు. రాయలసీమ ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్రత్యేక అభివద్ధి ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చిందన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకమైందని, విశాఖ రైల్వే జోన్‌ ప్రస్తావనే లేదని, ఆంధ్ర ఆత్మాభిమానికి ప్రతీకైన విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మకానికి పెడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జవహర్లాల్‌ నెహ్రూ మొదలుకొని మన్మోహన్‌సింగ్‌ వరకు 13 మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం రూ.46 లక్షల కోట్ల అప్పు చేయగా ఎనిమిదేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం రూ.109 లక్షల కోట్ల అదనంగా అప్పు చేసిందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టడంతో పాటు, ప్రభుత్వ రంగ సంస్థలను, విమానాశ్రయాలను, నౌకాశ్రయాలను, రైల్వే స్టేషన్లను అమ్మేస్తుందని దుయ్యబట్టారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడంతో పాటు పెట్రోల్‌ డీజిల్‌ వంటగ్యాస్‌ నిత్యవసర సరఫరా ధరలు సామాన్యునికి అందుబాటులో లేవన్నారు. సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో టిడిపి, వైసిపి, జనసేనలకు ఓటేస్తే అది బిజెపికి వేసినట్లేనన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే రూ.ఆరు లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ, రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా, నిరుపేద కుటుంబానికి నెలకు రూ.ఆరు వేలు ఆర్థిక సహాయం, రాష్ట్రానికి సంజీవని ఎలాంటి ప్రత్యేక హోదా అమలు లాంటి కార్యక్రమాలు అమలు చేస్తారని పేర్కొన్నారు. కమలాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్‌ విష్ణుప్రీతంరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే ధ్యేయంగా సంస్థాగతంగా బలోపేతం చేస్తామన్నారు. సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు పొట్టిపాటి చంద్రశేఖర్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, వెంకటరెడ్డి, షేక్‌ గౌసియా, నాగరాజు రెడ్డి, చార్లెస్‌, సందన్‌ బాషా, ఓబులేసు పాల్గొన్నారు