పనాజి : మూడు సార్లు గోవా ముఖ్యమంత్రి పనిచేసిన మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ బిజెపికి రాజీనామా చేశారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. విలువల కోసం నిలబడాల్సిన సమయం వచ్చిందని, తన రాజకీయ భవితవ్యాన్ని పనాజీ ప్రజలు నిర్నయిస్తారని ఉత్పల్ పారికర్ అన్నారు. బిజెపిలో అత్యంత సీనియర్ నేతగా గుర్తింపు పొందిన మనో హర్ పారికర్ 2019లో మరణించేంత వరకు 25 ఏళ్ల పాటు పనాజీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. తండ్రి మరణానంతరం ఖాళీ అయిన పనాజీ స్థానం నుండ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్పల్ భావించారు. అయితే పారికర్ విధేయుడైన సిద్ధార్థ్ కుంకోలియన్‌కర్‌కి మద్దతు ఇవ్వాలని బిజెపి కోరింది. అయితే ఆ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి అటాన్సియో మోన్సెరట్ విజయం సాధించారు. గెలిచిన అనంతరం మోన్సెరట్ మరో తొమ్మిది మంది కాంగ్రెస్ నేతలతో కలిసి బిజెపిలో చేరారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మోన్సెరట్‌కి పనాజీ టికెట్‌ని కేటాయించింది. అయితే పనాజీ నియోజకవర్గం టికెట్‌ను ఉత్పల్ పారికర్ ఆశించారు. బిజెపి నిరాకరించడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉత్పల్ పారికర్‌ని తమ పార్టీలోకి ఆహ్వానించారు. శివసేన కూడా ఉత్పల్ పారికర్‌కు మద్దతుగా నిలిచింది. ఆయన పార్టీలోకి వస్తే పనాజి అభ్యర్థిని ఉపసంహరించుకుని టిక్కెట్ కేటాయిస్తామని ప్రకటించింది.
ఈ ప్రకటనపై బిజెపి గోవా ఇన్‌చార్జి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. పారికర్ కుటుంబం బిజెపికి సొంత కుటుంబం వంటిదని, పారికర్ కోరిన నియోజకవర్గానికి ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారని అన్నారు. ఆయనను అక్కడ్నించి తప్పించడం సమంజసం కాదని, ఉత్పల్ పారికర్‌కి మరో రెండు సీట్లు ఆఫ్‌ర్ చేశామని అన్నారు.










