Aug 06,2023 21:12

సిఐటియు ఆధ్వర్యాన మానవహారం
ప్రజాశక్తి - తణుకురూరల్‌
దేశ స్వాతంత్య్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బిజెపికి పాలించే అర్హత లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ విమర్శించారు. ఆదివారం స్థానిక నరేంద్ర సెంటర్‌లో 'మోడీ బారి నుంచి - సేవ్‌ ఇండియా సేవ్‌' అనే పేరుతో సిఐటియు ఆధ్వర్యంలో మానవహారం, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతాప్‌ మాట్లాడుతూ 76వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగు పెడుతున్ననప్పటికీ కుల, మత, ప్రాంతం పేరుతో పాలకులు ఘర్షణలు సృష్టించడం సిగ్గుచేటన్నారు. నూతన టెక్నాలజీతో ఆధునిక ప్రపంచంవైపు సాగుతున్న తరుణంలో అనాగరిక పద్ధతులతో కొన్ని శక్తులు వెనక్కి తీసుకెళ్తున్నాయన్నారు. అమర వీరులు కన్న కలలు నేటికీ కలలుగానే మిగిలిపోతున్నాయని తెలిపారు. నేటికీ అందరికీ విద్య, ఉపాధి, గూడు, గుడ్డ, వైద్యం వంటివి అందని ద్రాక్షలా ఉన్నాయని పేర్కొన్నారు. బిజెపి తన అధికారం కోసం సిఎఎ, యుసిసి వంటి వాటిని తీసుకొచ్చి ప్రజలు మధ్య చిచ్చు పెడుతోందని విమర్శించారు. బిజెపి విధానాలను విమర్శించే వారిని దేశ ద్రోహులుగా మోడీ చెప్పడం హాస్యాస్పదం అన్నారు. దేశ స్వాతంత్య్రాన్ని మోడీ బారి నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత విద్యార్థులు, యువత, అభ్యుదయవాదులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అడ్డగర్ల అజయకుమారి, కామన మునిస్వామి, ఎన్‌.ఆదినారాయణ బాబు, కె.అయ్యప్ప, శ్రీనివాస్‌రాజు, వైటి రామకృష్ణ పాల్గొన్నారు.