Jan 11,2022 15:09

లక్నో :  యుపిలో బిజెపికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒబిసి వర్గానికి నాయకత్వం వహిస్తున్న స్వామి ప్రసాద్‌ మౌర్య బిజెపికి ఝలక్  ఇచ్చి    సమాజ్‌వాది పార్టీ గూటికి చేరారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు స్వామి బాటలోనే సమాజ్‌వాది పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ''భిన్నమైన భావజాలం ఉన్నప్పటికీ యోగి కేబినెట్‌లో అంకిత భావంతో పనిచేశానని, కానీ దళితులు, ఒబిసిలు, రైతులు, నిరుద్యోగులు, చిన్న వ్యాపారులపై కొనసాగుతున్న అణిచివేతను వ్యతిరేకిస్తూ.. బిజెపికి రాజీనామా చేస్తున్నాను'' అని స్వామి ప్రసాద్‌ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. లేఖ వెలువడకముందే ఆయన అఖిలేష్‌తో సమావేశం కావడం, పార్టీలో చేరడం కూడా జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం తూర్పు యుపిలోని పద్రౌనా నుండి బిజెపి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఒబిసి వర్గంపై గట్టి పట్టున్న మౌర్య 2016లో బహుజన సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి)ని వీడి బిజెపిలో చేరారు. ఆయన కుమార్తె సంఘమిత్ర ప్రస్తుతం యుపి బిజెపి ఎంపిగా ఉన్నారు. యుపి అసెంబ్లీ ఎన్నికలను దేశంలోనే అత్యంత కీలకమైన ఎన్నికలుగా రాజకీయ పార్టీలు భావిస్తాయి. 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు వీటిని సెమీ ఫైనల్స్‌గా పేర్కొంటాయి.