Apr 20,2022 06:55

ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన ఒక లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ స్థానాల ఫలితాలు ప్రతిపక్షాలకు మోదాన్నివ్వగా, బిజెపికి ఖేదాన్ని మిగిల్చాయి. బెంగాల్‌లో అటు బిజెపి విచ్ఛిన్నకరవాద రాజకీయాలకు, ఇటు తృణమూల్‌ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా నికరంగా పోరాడుతున్న సిపిఐ(ఎం)కు ఒకింత ఊరటనిచ్చాయి. స్థూలంగా చూసినప్పుడు బీహార్‌లో మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల అధికారంలో ఉన్న పార్టీలవైపే ప్రజలు మొగ్గు చూపారనే చెప్పాలి. బీహార్‌లో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడి అభ్యర్థి చేతిలో అధికార బిజెపి అభ్యర్థి 35వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోవడం ఒక ముఖ్యమైన పరిణామం. 2020 ఎన్నికల్లో నితీష్‌ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బొటాబొటీ మెజార్టీతో అధికారం చేజిక్కించుకున్నప్పటికీ ఆ కూటమికి, ఆర్జేడి నేతృత్వంలోని మహా కూటమికి మధ్య ఓటింగ్‌ శాతంలో తేడా చాలా స్వల్పం. ఎన్డీయేకు 37.26 శాతం ఓట్లు రాగా, ఆర్జేడి కూటమికి 37.23 శాతం ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికల్లో ఆర్జేడిదే పైచేయి అని తేలింది.ఇటీవల యుపి, ఉత్తరాఖండ్‌లో విజయం తరువాత ఉత్తరాదిలో తనకిక ఎదురే లేదని జబ్బలు చరుస్తున్న బిజెపికి ఇది ఎదురు దెబ్బే. పద్దెనిమిది లోక్‌సభ, 77 అసెంబ్లీ స్థానాలు సాధించిన బెంగాల్‌లో రెండు పర్యాయాలుగా వరుసగా గెలుస్తూ వచ్చిన అసన్‌సోల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఈ సారి ఓడిపోవడం, బాలీగంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో డిపాజిట్‌ సైతం గల్లంతవడంతో బిజెపి తీవ్ర నిరాశకు గురైంది. గోరు చుట్టుపై రోకటి పోటులా ఉప ఎన్నికల తరువాత బెంగాల్‌ బిజెపి శాఖలో లుకలుకలు బయటపడ్డాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని పార్టీ జిల్లా నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ముర్షిదాబాద్‌ జిల్లాలో ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు పార్టీ పదవుల నుంచి వైదొలిగారు. నాదియా జిల్లాలోను అసమ్మతి భగ్గుమంది. డజను మందికిపైగా జిల్లాల నాయకులు పార్టీ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం, 2019 ఎన్నికల్లో కొల్‌కతాలోని జాదవ్‌ పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బిజెపి తరపున పోటీ చేసిన అనుపమ్‌ హజారే పార్టీ పదవికి రాజీనామా ఇవ్వడం బిజెపిలో రగుల్కొంటున్న అసమ్మతికి సంకేతాలు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అస్త్రాలుగా చేసుకుని మహారాష్ట్రలో మహా వికాస్‌ అగాదీ (ఎంవిఎ) ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రంలో మోడీ సర్కార్‌ చేసిన యత్నాలకు అక్కడి ప్రజలు దీటుగానే బదులిచ్చారు. కొల్హాపూర్‌ నార్త్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ చేతిలో బిజెపి పరాజయం పాలైంది. బీహార్‌లోని బొచాహన్‌ నియోజకవర్గంలో బిజెపికి శృంగభంగం తప్పలేదు. చత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు దాసోహమన్నది. ఈ ఉప ఎన్నికలు చిన్నవే అయినప్పటికీ అవి ఇచ్చిన సందేశం గొప్పది. అందులోనూ ఏడాది వ్యవధిలో కీలకమైన గుజరాత్‌, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ ఫలితాలు బిజెపికి ఒక హెచ్చరిక అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అసన్‌సోల్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సమయంలోనే బిజెపి హిజాబ్‌, హలాల్‌ మాంసం, అజాన్‌ వివాదాలను ముందుకు తెచ్చి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టింది. బిజెపి విచ్ఛిన్నకర రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సిపిఐ(ఎం) బెంగాల్‌లో తిరిగి నిలదొక్కుకుంటున్నదనడానికి ఈ ఉప ఎన్నికల్లో దానికి పెరిగిన ఓటింగ్‌ శాతం ఒక సంకేతం. బాలీగంజ్‌ నియోజకవర్గంలో తృణమూల్‌కు చెందిన మాజీ కేంద్ర మంత్రికి సిపిఎం గట్టి పోటీ ఇచ్చింది. టిఎంసి అభ్యర్థికి 49 శాతం ఓట్లు సాధించగా, సిపిఎం అభ్యర్థి 30 శాతం (30,971) ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బిజెపికి కేవలం 12.31 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. అసన్‌సోల్‌ పార్లమెంటరీ నియోజకవర్గంలో తృణమూల్‌ తరపున బరిలోకి దిగిన శతృఘ్న సిన్హాతో తలపడిన సిపిఎం అభ్యర్థి 90, 412 ఓట్లు సాధించడం విశేషం. 2021 బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నాటికి, ఇప్పటికి సిపిఎం పట్ల ప్రజల ఆదరణ పెరుగుతుందనడానికి ఇదొక సంకేతం. మొత్తం మీద ఈ ఉప ఎన్నికల ఫలితాలు బిజెపి కార్పొరేట్‌-హిందూత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తులకు కొత్త ఉత్సాహాన్నిస్తాయి.