బిజెపికి దేశాన్ని పాలించే అర్హత లేదు..
2024 ఎన్నికల్లో బిజెపిని చిత్తుగా ఓడించండి..
ఢిల్లీ పీఠం మీద కూర్చునే హక్కు బిజెపికి లేదు..
ప్రచార బేరి ముగింపు బహిరంగ సభలో సిపిఎం,సిపిఐ
ప్రజాశక్తి-నంద్యాల కలెక్టరేట్
దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచి పెడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపికి దేశాన్ని పాలించే అర్హత లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె. ప్రభాకర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బిజెపిని సాగనంపుదాం.. దేశాన్ని కాపాడుకుందాం.. బిజెపి ప్రజావ్యతిరేక విధానాలపై ప్రచార భేరి ముగింపు సందర్బంగా గురువారం సిపిఎం, సిపిఐ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కె. ప్రభాకర్ రెడ్డి, ముప్పాళ నాగేశ్వరావు, సిపిఎం రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మిలు ముఖ్యతిధిగా పాల్గొన్నారు. బహిరంగ సభకు సిపిఎం పట్టణ కార్యదర్శి పుల్లానరసింహ, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షత వహించారు.
కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేస్తుందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ చుట్టూ దొంగలు చేరారని విమర్శించారు. దేశ సంపాదనంతా అంబాని, ఆదానీలకు దొచిపెడుతున్నారని అన్నారు. నరేంద్ర మోడీ 2014 ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. ధరలు తగ్గిస్తామని, కొత్త ఉద్యోగాలు వ్యవసాయ సంక్షోభం నుండి రైతులను కాపాడుతామని, నల్లధనాన్ని బయటకు తీసి అవినీతిని అరగడతామన్న నరేంద్ర మోడీ వాటిని విస్మరించాలన్నారు. 2019 ఎన్నికల్లో అభివద్ధిని వివరిస్తూ ఎన్నికలకు వెళ్లడానికి ధైర్యం లేక పుల్వామా బాల్‌కోట్ పాకిస్తాన్ ఇలాంటి దేశభక్తి వంటి భావోద్వేగాలను రెచ్చగొడుతూ అధికారంలోకి వచ్చారన్నారు. నరేంద్ర మోడీ నాటినుండి ప్రజాస్వామ్యాన్ని కూల్చివేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రజలపై దాడి చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ఢిల్లీ రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ముస్లిం మైనార్టీల పైన దాడులు చేస్తున్నారని, ఇలాంటి బిజెపికి దేశాన్ని పాలించే నైతిక హక్కు లేదన్నారు.
ముప్పాల నాగేశ్వరావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి సాగిస్తున్న విధ్వంసకర కార్పొరేట్ విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ల కాలంలో రూపాయి విలువ తీవ్రంగా పడిపోయిందన్నారు. సంవత్సరానికి కోటి ఉద్యోగాలు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నరేంద్ర మోడీ మాట తప్పారన్నారు. దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోయి దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితి రానున్నదన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పురం చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.
సిపిఎం రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి మాట్లాడుతూ బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నికరంగా పోరాడేది వామపక్ష పార్టీలేనన్నారు. దేశవ్యాప్తంగా వాపక్షాలు బిజెపి విధానాలకు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమం చేపట్టామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక హామీని కూడా మోడీ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలవడం కోసం బిజెపి దేశభక్తి పేరుతో ముందుకొస్తుందన్నారు. దేశ చరిత్రను మార్చే ప్రయత్నం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తుంది అన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైతే, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి తనకు 23 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలోని ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రత్యేక హోదా విభజన హామీలను తీసుకొస్తాని చెప్పి అధికారంలోకి వచ్చాక ఎంపీలు ఒకరికొకరు నరేంద్ర మోడీకి దాసోహం అంటున్నారని ఆమె విమర్శించారు. బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ. నాగరాజు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు లక్ష్మణ్, మహమ్మద్ గౌస్, వెంకట లింగం, సిపిఎం సీనియర్ నాయకులు తోట మద్దులు, సిపిఐ నాయకులు శ్రీనివాసులు, నాగముని నాయుడు, చెన్నయ్య పాల్గొన్నారు.










