Jan 24,2022 17:44

చండీఘర్‌ : వచ్చే నెలలో జరిగే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 65 స్థానాల్లో, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ నేతృత్వంలోని నయా పార్టీ పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ 37 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కూటమిలోని మూడవ పార్టీ అకాలీదళ్‌ (సంయుక్త్‌) మరో 15 స్థానాల్లో బరిలోకి దిగనుంది. ఈ మేరకు సీట్ల సర్దుబాట్లు చేసుకున్నట్లు ఢిల్లీలో అమరీందర్‌ సింగ్‌, బిజెపి చీఫ్‌ జెపి నడ్డా, శిరోమణి అకాలీదళ్‌ సంయుక్త్‌ చీఫ్‌ సుఖ్‌దేవ్‌ సింగ్‌ ధిండ్సా ప్రకటించారు. ఆహార భద్రత, రక్షణలో పంజాబ్‌ను ఆకాశానికెత్తేసిన నడ్డా... ఈ రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం నిమిత్తం డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం అవసరమని పేర్కొన్నారు. 117 స్థానాలకు వచ్చే నెల 20న జరిగే ఎన్నికల నేపధ్యంలో అమరీందర్‌ సింగ్‌ ఆదివారం 22 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన సంగతి విదితమే.