దేశరక్షణ భేరి ప్రచారోద్యమంలో సిపిఎం నేతలు
ప్రజాశక్తి -ములగాడ : బిజెపి ప్రభుత్వ విధానాలు దేశానికే ప్రమాదకరమని సిపిఎం నేతలు హెచ్చరించారు. శనివారం దేశరక్షణభేరి ప్రచారోద్యమంలో భాగంగా మల్కాపురం జోన్ 62వ వార్డు దుర్గానగర్, తగరపువలస వైజంక్షన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కరపత్రాలను పంచిపెట్టారు. ఈసందర్భంగా మల్కాపురంలో సిపిఎం జోన్ కార్యదర్శి పి.పైడిరాజు మాట్లాడుతూ, దేశమంతటా ఒకే పన్ను విధానమంటూ జిఎస్‌టిని తీసుకొచ్చి, ధరల భారంతో దేశ ప్రజలను నిలువునాబిజెపి ప్రభుత్వం ముంచేసిందని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి లేకుండా చేసిందన్నారు. కేంద్రంలోని బిజెపి నిరంకుశవిధానాలకు ధీటుగా రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం కూడా విద్యుత్, ఆర్‌టిసి ఛార్జీల పెంపు, చెత్తపై పన్ను విధింపు వంటి ప్రజాకంటక విధానాలను ప్రజలను కోలుకోనీయకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బి.అర్జునరావు, ఎస్ అచ్యుతరావు, ఎం.రవికుమార్, పి మోహన్, కె.సింహాద్రప్పుడు పాల్గొన్నారు.
బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి
తగరపువలస : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఐక్యంగా ప్రతిఘటించాలని సిపిఎం నేతలు పిలుపునిచ్చారు. ఈ నెల 14 నుంచి 27 వరకు దేశరక్షణ భేరి ప్రచారోద్యమంలో భాగంగా స్థానిక వై.జంక్షన్‌లో సిపిఎం నేతలు కరపత్రాలను పంచారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నేత ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ, ఎపి విభజన చట్టం రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ వంటి హామీలన్నీ తుంగలో తొక్కేశారన్నారు. కార్మికచట్టాలను కోడ్‌లుగా సంస్కరించి, కార్మికులకు భద్రత లేకుండా చేసిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 27న సరస్వతి పార్కు నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్ వరకు ప్రదర్శన, బహిరంగ సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రవ్వ నరసింగరావు, రీసు నరసింగరావుు పాల్గొన్నారు.










