Aug 15,2023 20:47

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
      దేశ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని కాపాడుకుందామని మోడీ కో హటావో.. దేశ్‌కో బచావో నినాదంతో సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం), కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్‌ సెంటర్‌లోని బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ, నిరసన కార్యక్రమం చేపట్టారు. మోడీని సాగనంపుదాం.. దేశాన్ని కాపాడుకుందాం, మతసామరస్యం,లౌకిక తత్వం వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌, బికెఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, ఎఐకెకెఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు డి.రంగనాథ్‌, ఎఐటియుసి జిల్లా నాయకులు కె.కృష్ణమాచార్యులు, ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మత ఘర్షణలు పెరిగి దేశ సమైక్యతకు, సమగ్రతకు ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో జరిగిన ఘోరాలను ప్రపంచం అంతా చూసి నివ్వెరపోయారని చెప్పారు. మరోవైపు దేశ సంపదను కార్పొరేట్‌ కంపెనీలు లూఠీచేసే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలున్నాయని విమర్శించారు. దేశ స్వాతంత్య్రానికి, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య విలువలకు మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. దేశంలో కార్మికులు, రైతులు, ఇతర శ్రామిక ప్రజలపై భారాలు వేస్తోందని చెప్పారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం దేశ స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు బి.సోమయ్య, కె.విజయలక్ష్మి, పి.కన్నబాబు, వి.సాయిబాబా, బి.జగన్నాధం, పి.పెంటయ్య, బుగ్గల ప్రభాకర్‌, అప్పారావు, రమణ, వీరభద్రం, నాని, జి.గోపి, క్రాంతి, త్రినాధ్‌, శ్రీను, భాస్కర్‌రావు, విజరు, కొండ, కళ్యాణ్‌, జోగి నాగేశ్వరరావు, పుప్పాల శ్రీనివాసరావు, గేదెల నాగేశ్వరరావు, సిహెచ్‌.కూర్మారావు పాల్గొన్నారు.