Sep 04,2023 22:09

  • రాజేశ్వరమ్మ వర్థంతి సభలో స్వరూపరాణి

ప్రజాశక్తి-ఉయ్యూరు: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ,15 అంశాలను నిర్వీర్యం చేస్తున్నారని, మహిళల హక్కులకు భంగం వాటిల్లే విధంగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఐద్వా రాష్ట్ర కమిటీ నాయకులు కె.స్వరూపరాణి అన్నారు. సోమవారం ఉయ్యూరులోని నాగళ్ల రాజేశ్వరమ్మ జానకి రామయ్య విజ్ఞాన కేంద్రంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ మహిళా నేత నాగళ్ల రాజేశ్వరమ్మ ఏడో వర్థంతి సభ నిర్వహించారు. సభలో స్వరూపరాణి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను యధాతధంగా అమలు చేయకుండా మతోన్మాద బిజెపి ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో సొంత ఎజెండాను మహిళలు, ప్రజలపై బలవంతంగా రుద్దుతోందన్నారు. 1937 దశకంలోనే కృష్ణాజిల్లా వ్యాప్తంగా మహిళల హక్కుల కోసం రాజేశ్వరమ్మ పోరాడారన్నారు. మూఢాచారాలు, సాంఘిక బహిష్కరణకు వ్యతిరేకంగా ఉద్యమించార్నఆ్నరు. తొలుత రాజేశ్వరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి వీరమాచనేని జ్యోతి, ఉపాధ్యక్షురాలు బి.కీర్తి, యార్లగడ్డ జోయ, పిన్నమనేని విజయ, మాధవి, కె.వాణి, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.శివనాగేంద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పవన్‌కుమార్‌, సభ్యులు ఎ.తిరుపతిరావు, రైతు సంఘం నాయకులు అన్ని సుబ్బారావు, సిపిఎం పట్టణ కార్యదర్శి బి.రాజేష్‌, నెమ్మాది నాగమణి, ప్రశాంతి, సునీత,ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
 .