Dec 19,2022 23:35

  • బిటిఆర్‌ జయంతి కార్యక్రమంలో వక్తలు

ప్రజాశక్తి-విజయవాడ: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై సంఘటితంగా పోరాడాలని పలువురు నాయకులు పేర్కొన్నారు. సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు బిటి రణదివె 119వ జయంతి సందర్భంగా స్ధానిక దుర్గాపురం సిఐటియు నగర కార్యాలయంలో సోమవారం సమావేశం జరిగింది. యూనియన్‌ సెంట్రల్‌ సిటీ అధ్యక్షుడు కె.దుర్గారావు సమావేశానికి అధ్యక్షత వహించారు. సీనియర్‌ నాయకులు మల్లంపల్లి సాంబశివరావు బిటిఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రణదివె స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములయ్యారని చెప్పారు. కార్మిక సంఘాలు పెట్టి వారిని బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొనేట్లు చేశారన్నారు. ఎమర్జెన్సీకు వ్యతిరేకంగా పోరాటం చేసి కార్మిక హక్కుల పరిరక్షణకు కషి చేశారని గుర్తుచేసుకున్నారు. 1974 రౖల్వే చారిత్రక సమ్మెకు మద్దతు కూడగట్టటానికి విశేష కృషి చేశారని చెప్పారు.కార్మిక హక్కులు కాలరాసేలా, ప్రజల ఐక్యత దెబ్బతీసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న విధానాలపై పోరాటం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు సెంట్రల్‌ సిటీ ప్రధాన కార్యదర్శి ఎం.వి.సుధాకర్‌, ఆర్‌.కోటేశ్వరరావు, ఎం.సీతారాములు, వై.సుబ్బారావు, ఎం.వి.రమణ, బి.గోవింద్‌, టి.ప్రభుదాసు పాల్గొన్నారు. ప్రజాశక్తి-తిరువూరు: సిఐటియు అఖిల భారత మాజీ అధ్యక్షులు, కార్మిక ఉద్యమ నేత బిటి రణదివె 119వ జయంతి తిరువూరులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రణదేవ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిఐటియు తిరువూరు మండల కార్యదర్శి బలగాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్మికుల హక్కుల, సంక్షేమం కోసం పోరాడిన ఉద్యమాల వేగుచుక్క రణదివె అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్‌ నాయకులు ఎస్‌.వి భద్రం, మండల నాయకులు ఆకుల రవి, మరకాల ఇశ్రాయేలు, ముఠా యూనియన్‌ నాయకులు ఆకుల రామారావు, సత్యం, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.