Apr 23,2023 00:43

నర్సీపట్నంలో ప్రచారం చేపడుతున్న నాయకులు

ప్రజాశక్తి -నర్సీపట్నంటౌన్‌:కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డు కోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.సత్తిబాబు పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వం కార్మికులకు, ఉపాధి కూలీలకు, రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కార్మికులతో శనివారం సమావేశమైన సత్తిబాబు మాట్లాడుతూ, కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించి, రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని పేర్కొన్నారు. ఈనెల 28న నర్సీపట్నంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నర్సీపట్నంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
రాంబిల్లి :మండలంలోని కొత్తపట్నం, అప్పారాయుడుపాలెం గ్రామాల్లో సీపీఎం ఆధ్వర్యంలో ప్రచార భేరి నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి జి దేమునాయుడు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రజా, కార్మిక, వ్యతిరేక, మతోన్మాద విధానాలపై పోరాటం చేయాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, గ్యాస్‌, పెట్రోల్‌ డీజిల్‌ ధరలను పెంచి ప్రజల నడ్డి విరిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఎన్‌.నారాయణ రావు, దోని అప్పలరాజు, సిహెచ్‌ నూకరాజు, సిహెచ్‌ నూకన్న, సిహెచ్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మునగపాక రూరల్‌ : ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న మోడీ విధానాలను ఖండించాలని సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌ బ్రహ్మాజీ పిలుపునిచ్చారు. ప్రచార భేరి కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రం మునగపాకలో తిమ్మడు కాలువ వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులు చేస్తున్న కార్మికులను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెంటకోట శ్రీను, దొడ్డి సంజీవి, పోలిపల్లి లక్మి పాల్గొన్నారు.
సబ్బవరం : బిజెపి ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి ప్రభావతి కోరారు. మండలంలోని బంగారమ్మ పాలెం గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలిసి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. పెంచిన పెట్రోల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతుందని మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు ఉప్పాడ సత్యవతి, లావేటి ఎర్రయ్య, పిల్లి లక్ష్మీ, పిల్లి దేముడమ్మ పాల్గొన్నారు.