Sep 08,2021 06:09

     మొత్తం ప్రభుత్వ రంగం అనేది లేకుండా... ప్రయివేటుకు పోటీ అనేది లేకుండా చేస్తున్నారు. చిన్న చిన్న వారెవరూ మనుగడ సాగించలేని విధంగా ఇప్పుడు నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ ప్రకటించారు. భారత ప్రభుత్వం 74 సంవత్సరాల నుండి నిర్మించిన స్ట్రాటజిక్‌ ఇండిస్టీ మొత్తం ఆస్తులు ఒక్క దెబ్బతో ప్రయివేటీకరణ కంటే అన్యాయంగా బడా పెట్టుబడిదారుల పరం చేయపూనుకున్నది. రోడ్లు, విద్యుత్‌ నిర్వహణ, హైడల్‌ పవర్‌, సహజ వాయువు, పెట్రోలియం పైపులైన్లు, గిడ్డంగులు, రైల్వే ఫ్రైట్‌ కారిడార్లు, గూడ్సు షెడ్లు, రైల్వే స్టేషన్లు, రైలు మార్గాలు, టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థ, ఇంటర్‌నెట్‌ వ్యవస్థ, విమానయానం, ఓడరేవుల రవాణా ఆఖరుకు యువత వినియోగించే స్టేడియంలతో సహా సమస్తం కార్పొరేట్లకు లీజుకు ఇవ్వదలుచుకున్నారు.
      దేశంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వ ధోరణి మరింత ప్రమాదకరంగా మారింది. ప్రాంతీయ పార్టీల మద్దతు బిజెపి కి అవసరం లేకుండా పోయింది. పార్లమెంటులో పూర్తి మెజారిటీ రావడంతో 370 అధికరణం రద్దు, పౌరసత్వ చట్ట సవరణ, గోరక్షణ చట్టం, ఆహారపు అలవాట్లపై నిబంధనలు, పాపులేషన్‌ పాలసీ, లవ్‌ జీహాద్‌ మొదలగు చర్యలు వేగవంతం చేసింది. రైతు వ్యవసాయం రద్దు చేసి కార్పొరేట్లకు కట్టబెట్టే చట్టాలు తెచ్చింది. విద్యుత్‌ చట్టానికి సవరణ, మిగిలివున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ వేగవంతం చేసింది. కార్మిక కోడ్‌ల పేరుతో హక్కుల హరింపు, రాష్ట్రాల ఆర్థిక హక్కులపై జిఎస్టీ పేరుతో దాడి గతంలోనే ప్రారంభమైంది. ఇటీవల విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు లాంటి అనేక అంశాల్లో రాష్ట్రాల హక్కులపై దాడి ఎక్కుపెట్టింది. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చింది. ఈ మొత్తం విధానాలు దేశంలో చిన్న మధ్యతరహా ప్రాంతీయ పెట్టుబడిదార్లకు నష్టదాయకంగా మారాయి. ప్రాంతీయ పార్టీల ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు కేంద్రం అనుసరించే విధానాలతో ఇంతకు ముందు లాగా పాలన సాగించగలిగిన పరిస్థితి లేదు. ఆర్ధిక వనరుల కుదింపు, హక్కుల్ని హరించడం ద్వారా రాష్ట్రాలను బలహీనపరచి 'బలమైన కేంద్రం - బలహీనమైన రాష్ట్రాలు' అన్న ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఎజెండాను అమలు చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలకు ఇది ఒక హెచ్చరిక అయ్యింది. ఈ వాస్తవాన్ని గుర్తించి ఈ విధానాలను వ్యతిరేకిస్తేనే రాష్ట్రాల హక్కులకు రక్షణ ఉంటుంది.
      మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా, విభజన హామీలు, కడప ఉక్కు లాంటి వాటితో సహా రాయలసీమ, ఉత్తరాంధ్ర సమస్యలు, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కొరత రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బదీస్తున్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వీటికి తోడైంది. ఇటీవల కాలంలో సహకార రంగ చట్టానికి కేంద్రం సవరణ తెచ్చి రాష్ట్రాల హక్కుల్ని హరించింది. పోర్టుల చట్టానికి సవరణ తెచ్చి రాష్ట్రాల పరిధిలో ఉన్న చిన్న పోర్టుల్ని కేంద్రం తన ఆధీనంలోకి తెచ్చుకున్నది. సమాచార హక్కు చట్టానికి సవరణ తెచ్చి రాష్ట్ర కమిషనర్ల జీతాలు నిర్ణయం సైతం కేంద్రం గుంజేసుకున్నది. విద్యారంగంలో సిలబస్‌ మార్పులు తెచ్చి రాష్ట్రాల పరిధిని, హక్కును దెబ్బతీసింది. అంతే కాకుండా కాషాయీకరణ, కార్పొరేటీకరణకు పూనుకుంది.
ఎంతో వైవిధ్యభరితమైన సామాజిక, సాంస్కృతిక, ప్రాంతీయ గుర్తింపులన్నీ బిజెపి హిందూత్వం కారణంగా పూర్తిగా కలుషితమైపోతున్నాయి. ఇది ప్రాంతీయ పార్టీల మనుగడకు ముప్పుగా పరిణమించింది. బిజెపి, ఆర్‌.ఎస్‌.ఎస్‌ విధానాలతో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు లొంగి వ్యవహరించడానికి పూనుకున్నా బలవంతంగా రుద్దే ఆర్థిక రాజకీయ విధానాలు ఉమ్మడి వ్యవహారంలో పొసిగే పరిస్థితి లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భూస్వాములు మిగులుతో పెట్టుబడిదారీ వ్యవసాయ పద్ధతులు ప్రవేశపెట్టారు. గ్రామాల్లో కాంట్రాక్టర్ల, పెట్టుబడిదారీ భూస్వాముల ప్రాబల్యం పెరిగింది. ఈ మూడు నల్ల చట్టాలతో మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కార్పొరేట్ల స్వాధీనమైపోతోంది. చాలా పంటలకు గిట్టుబాటు ధర లేక రైతాంగ ఆర్థిక పరిస్థితి ఈ కాలంలో దెబ్బతిన్నది. మార్కెట్‌ కమిటీలు, ఎఫ్‌సిఐ ఎపిఎంసి లాంటి సంస్థలు రైతులకు ఎంతో కొంత ఉపశమనం ఇస్తూ వచ్చాయి. కానీ ఈ మూడు చట్టాలతో సంక్షోభంలో ఉన్న రైతుల వ్యవసాయం పూర్తిగా కార్పొరేట్ల వశమైపోతుంది. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారంపై పట్టును కార్పొరేట్లకు బిజెపి కట్టబెడుతోంది.
 

                                                                 ఆస్తుల నగదీకరణ

     ''నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌'' పేరుతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ ఆస్తుల నిర్వహణను లీజుల పేరుతో ప్రయివేటుపరం చేస్తున్నట్లు ప్రకటించింది. ఒక చట్టమూ లేదు, పార్లమెంటులో చర్చా లేదు. విధి విధానాలు ప్రకటించే పత్రమూ లేదు. చిత్తు ప్రతిపాదనలూ లేవు. అయినా దీన్ని ప్రభుత్వ విధానంగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. గతం నుండీ డిజిన్వెస్ట్‌మెంటు అని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ అని కొన్ని మాటలు వింటూ వచ్చాం. కొన్ని డిజిన్వెస్ట్‌మెంట్లు, ప్రయివేటీకరణలు జరిగాయి కూడా. కాని ఇప్పుడు జరుగుతున్నది అదిగాదు. మొత్తం ప్రభుత్వ రంగం అనేది లేకుండా... ప్రయివేటుకు పోటీ అనేది లేకుండా చేస్తున్నారు. చిన్న చిన్న వారెవరూ మనుగడ సాగించలేని విధంగా ఇప్పుడు నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ ప్రకటించారు. భారత ప్రభుత్వం 74 సంవత్సరాల నుండి నిర్మించబడిన స్ట్రాటజిక్‌ ఇండిస్టీ మొత్తం ఆస్తులు ఒక్క దెబ్బతో ప్రయివేటీకరణ కంటే అన్యాయంగా బడా పెట్టుబడిదారుల పరం చేయపూనుకున్నది. రోడ్లు, విద్యుత్‌ నిర్వహణ, హైడల్‌ పవర్‌, సహజ వాయువు, పెట్రోలియం పైపులైన్లు, గిడ్డంగులు, రైల్వే ఫ్రైట్‌ కారిడార్లు, గూడ్సు షెడ్లు, రైల్వే స్టేషన్లు, రైలు మార్గాలు, టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థ, ఇంటర్‌నెట్‌ వ్యవస్థ, విమానయానం, ఓడరేవుల రవాణా ఆఖరుకు యువత వినియోగించే స్టేడియంలతో సహా సమస్తం కార్పొరేట్లకు లీజుకు ఇవ్వదలుచుకున్నారు. సంవత్సరానికి రూ. లక్షన్నర కోట్లు, నాలుగు సంవత్సరాల్లో రూ. 6 లక్షల కోట్లు రాబట్టాలని లక్ష్యంగా ప్రకటించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కూడా ఈ మానిటైజేషన్‌ ప్రయోగించనున్నట్లు ప్రకటించారు.
 

                                                           మరీ అన్యాయం

       ఈ మానిటైజేషన్‌ విధానంతో ప్రభుత్వ రంగంలోని సమస్త ఆస్తులు లీజు పేరిట పెట్టుబడిదారుల వశమవుతాయి. ప్రయివేటీకరణ విధానంలో ఎంతో కొంత పెట్టుబడి పెట్టి ప్రభుత్వ రంగాన్ని కొనుక్కోవాలి. కానీ ఇప్పడు ఆ పెట్టుబడి కూడా అవసరం లేకుండా కేవలం లీజుతో ''అసెట్టు'' స్వాధీనం అవుతుంది. ఎంతో కాలం నుండి వ్యయ ప్రయాసలకు ఓర్చి నిర్మించిన పవర్‌ లైన్లన్నీ వీరి వశమవుతాయి. గ్యాస్‌ లైన్లు, ఆయిల్‌ లైన్లు, మెయింటెనెన్సులో పీల్చి పిప్పి చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్తారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గుంజుకునే విధానమే నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ విధానం. రైలు పట్టాలు, ఫ్రైట్‌ కారిడార్లు, రైళ్ళు, గూడ్సు షెడ్లు, ప్రభుత్వ నిర్వహణలో మెయింటెనెన్సు జరిగినట్లు లాభాలపై ఆధారపడ్డ కార్పొరేట్లు నిర్వహించవు. పీల్చి పిప్పి చేసిన తరువాత తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్తారు. మరో ముఖ్యమైన అంశం స్ట్రాటజిక్‌ ఇండిస్టీలో ఇప్పుడున్న పోటీ పోయి గుత్తాధిపతులు ప్రజలపై భారాలు మోపుతారు.
 

                                                            పోటీ వుండదు

     మొత్తం సేవా రంగ సంస్థలు ఈ మానిటైజేషన్‌ విధానంలో పెద్ద పెద్ద గుత్త సంస్థల వశమవుతాయి. సిమెంటు రంగంలో ఈ రోజు పరిశ్రమాధిపతులు లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ధరలు ఎలా పెంచారో అలాంటి పరిస్థితి గుత్త సంస్థల యాజమాన్యంలో జరుగుతుంది. ధరలు పెరుగుతాయి. ప్రజలు భారాలు మోయవలసి వస్తుంది.
(1) రైల్వేలు, న్యూక్లియర్‌ సంస్థలు, డిఫెన్సు రంగ ఉత్పత్తులు, పోర్టులు వంటి కీలక ప్రభుత్వ రంగ సంస్థల్ని (స్ట్రాటజిక్‌ ఇండిస్టీని) ప్రయివేటీకరణ చేయబోమని ప్రభుత్వాలు గతంలో పార్లమెంటులో చేసిన వాగ్దానాలు ఈ మానిటైజేషన్‌తో రద్దయిపోతున్నాయి.
(2) ప్రజా సేవల ప్రాధాన్యత రీత్యా ప్రజా రవాణా వ్యవస్థల వంటి సంస్థ్థలను నష్టాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుపుతామన్న పార్లమెంటు వాగ్దానం ఇక్కడ మంటగలిసి పోతోంది.
(3) ప్రభుత్వ రంగంలో ఉండి స్వల్ప మార్కెట్‌ షేర్లు కలిగిన సంస్థల వాటాలను ప్రయివేటుపరం చేయబోమని పార్లమెంటులో ప్రభుత్వాలు చేసిన ప్రకటనలూ ఈ దెబ్బతో గాలికి కొట్టుకుపోతున్నాయి.
(4) ప్రభుత్వ రంగంలో ఉన్న ఒక సంస్థ ప్రయివేటీకరణ జరిగితే ఆ రంగంలో పోటీ రద్దయి గుత్తాధిపత్యానికి అవకాశం ఇచ్చే సంస్థలు కొన్ని ఉన్నాయి. అలాంటి సంస్థలను ప్రయివేటీకరించబోమని పార్లమెంటులో ప్రజలకిచ్చిన వాగ్దానం నరేంద్రమోడీ మానిటైజేషన్‌లో బలైపోతోంది. ప్రభుత్వం పేర్కొన్న అన్ని రంగాల్లో గుత్తాధిపత్యానికి మార్గం ఏర్పడుతుంది.
మోడీ ప్రభుత్వం అంతకు ముందు ప్రభుత్వాలు ప్రయివేటీకరణ విధానాలు చేపట్టినప్పటికీ కీలకమైన రంగాల్లో ప్రభుత్వ రంగ ప్రాబల్యం ఉంటూనే వస్తున్నది. అందువల్ల ప్రయివేటు గుత్తాధిపత్యానికి కొంత అడ్డుకట్టలు వస్తూనే వున్నాయి. కానీ నేడు మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ మోనిటైజేషన్‌ వల్ల ప్రభుత్వ రంగం పూర్తిగా మాయమై ప్రయివేటు గుత్తాధిపత్యానికి ద్వారాలు పూర్తిగా తెరవబడతాయి. సామాజిక న్యాయం ప్రభుత్వ రంగంలోనే సాధ్యం అన్నది గుర్తించితే మానిటైజేషన్‌లో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు అది పొందలేరు.
 

                                                         విదేశాల అనుభవం

     బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, జర్మనీ లాంటి దేశాల్లో రైల్వేలో ప్రయివేటీకరణ అందరికంటే ముందు అమలు చేశారు. కొన్ని స్ట్రాటజిక్‌ ఇండిస్టీలలో ప్రయివేటు యాజమాన్యాలకు అవకాశం ఇచ్చారు. బ్రిటన్‌లో థాచర్‌ కాలంలో రైల్వే ప్రయివేటీకరణ అమలులోకి వచ్చింది. కొన్ని సంవత్సరాల తరువాత సేవల నాణ్యత పడిపోవడమేగాక టిక్కెట్లు వగైరాల భారం కూడా ఎక్కువై ప్రజల్లో నిరసనలు వ్యక్తంగావడంతో తిరిగి ప్రభుత్వ రంగంలోకి మార్చారు. పార్లమెంటులో రగడ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రయివేటీకరణతో పోల్చితే లీజు ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గుంజి వ్యవస్థను పీల్చి పిప్పి చేసే అవకాశం ఉందని అనేకమంది నిపుణులు పేర్కొన్నారు.
       పోర్టులు, ఎయిర్‌పోర్టులు, సోలార్‌ పవర్‌, టెలికం రంగం, సహజ వాయువు పైపులైన్‌, పెట్రోలియం పైపులైన్‌, వేర్‌ హౌసింగ్‌ గిడ్డంగులు లాంటివి భారతదేశంలో గుత్తాధిపత్యానికి ఈ మానిటైజేషన్‌లో అవకాశం ఇస్తున్నాయి. ఈ గుత్తాధిపత్యం ఎవరికీ అంతు పట్టనంతగా, అదుపుచేయడం సాధ్యంగానంతగా విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఇటీవల అమెరికా పార్లమెంటులో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారంలో ''అన్‌ ఫెయిర్‌'' కార్యకలాపాల గురించి నిర్దిష్టంగా పేర్కొని నియంత్రణా చర్యలు కావాలన్నారు. గూగుల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌ లాంటి వ్యాపార సంస్థల అన్‌ ఫెయిర్‌ కార్యకలాపాల మీద దక్షిణ కొరియా కొన్ని కఠినమైన నియంత్రణా చర్యలు చేపట్టింది. చిప్స్‌ తయారీ టెక్నాలజీ రంగంతోపాటు మరికొన్ని రంగాల్లో పెరిగిన గుత్తాధిపత్యం అదుపుచేయడానికి సాధ్యంగానంత స్థాయికి పెరిగిందని, చైనా దీని నివారణా చర్యల గురించి చర్చిస్తున్నట్లు వార్తలు వింటున్నాం.
పరిణామాలిలా ఉండగా నేడు నరేంద్రమోడీ ప్రకటించిన నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ విధానం ఏ రకంగా చూసినా పూర్తిగా ప్రజా వ్యతిరేకమైంది. ధరల నియంత్రణకు తోడ్పడే ప్రభుత్వ రంగం పాత్రను ఈ మానిటైజేషన్‌ రద్దు చేస్తోంది.
 

                                                      ప్రతిఘటనే మార్గం

     మన దేశంలో స్వాతంత్య్రానంతరం పెట్టుబడిదారీ ఆర్థిక పంథాను పాలక వర్గాలు చేపట్టాయి. 74 ఏళ్ళ పాలనా కాలంలో అటువైపు కొన్ని మార్పులు సంభవించాయి. గ్రామాల్లో పెట్టుబడిదారీ భూస్వాములు పెత్తనం చేస్తుంటే దేశంలో బడా పెట్టుబడిదార్లు వీరితో కుమ్మక్కై వ్యవహరిస్తూ వచ్చారు. భూమి రైతుల చేతుల్లోకి రాలేదు. పరిశ్రమల్లో కార్మికులకు సరైన వేతనాలు రాలేదు. ప్రస్తుత మానిటైజేషన్‌ ప్రక్రియతో రైతులకు, కార్మికులకు ఆ ఉన్న కొద్దిపాటి హక్కులు కూడా రద్దవుతాయి. స్ట్రాటజిక్‌ ఇండిస్టీలో పోటీ లేకుండా పోయి అన్నింటి ధరలు పెరుగుతాయి. అందుకే బిజెపి ఆర్థిక, రాజకీయ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పిలుపునిస్తోంది. సెప్టెంబర్‌ 27వ తేదీ బంద్‌ ఇందులో ఒక భాగం. కార్మిక కోడ్‌ల రద్దు, రైతు చట్టాల ఉపసంహరణ, కోవిడ్‌ కారణంగా ఉపాధి పోయినవారికి రూ.7,500 ఇవ్వడం లాంటి హక్కుల కోసం పోరాడాలి. బలమైన ప్రజా ఉద్యమమే భారాల్ని అధిగమించడానికి మార్గం.
      సెప్టెంబరు 14న సీతారాం ఏచూరి విజయవాడలో, 15న బి.వి.రాఘవులు కర్నూలులో, 16, 18 తేదీలలో బృందా కరత్‌ విశాఖ, తిరుపతిలలో సభలలో పాల్గొననున్నారు. ఈ సభలు బిజెపి విధానాలను తిప్పి కొట్టే లక్ష్యంతోనే జరుగుతున్నాయి. వీటిని జయప్రదం చేయాలని కోరుతున్నాం.
 

/ వ్యాసకర్త సిపియం రాష్ట్ర కార్యదర్శి /
పెనుమల్లి మధు

పెనుమల్లి మధు