Aug 20,2023 23:33

ప్రజాశక్తి-కాకినాడ కేంద్ర బిజెపి మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, నిరుద్యోగం, అధికధరలు, విద్యుత్‌ చార్జీలకు వ్యతిరేకంగా ఆగస్టు 30 నుండి సెప్టెంబర్‌ 4 వరకు సిపిఎం ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రచారోద్యమాన్ని ప్రజలంతా జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేషబాబ్జి కోరారు. ఆదివారం స్థానిక ఇంద్రపాలెం వంతెన ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సిపిఎం ప్రచార ఉద్యమ కరపత్రాన్ని శేషబాబ్జి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వివిధ రకాలుగా విద్యుత్‌ ఛార్జీలు భారీగా వేస్తున్నారన్నారు. చదువుకున్న యువతకు ఉపాధి కల్పించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళనల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. సెప్టెంబర్‌ 1న సచివాలయాల వద్ద విద్యుత్‌ బిల్లులు దహనం చేస్తామన్నారు. సెప్టెంబర్‌ 3వ తేదీన నిరుద్యోగులతో సదస్సు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్‌ 4వ తేదీన మండల కార్యాలయాల వద్ద ధర్నా చేపడతామన్నారు. కె.సత్తిరాజు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి మన రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వారికి భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఏమాత్రం స్పందించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం జరిగే ఉద్యమాలకు ప్రజలు సంఘీభావం తెలపాలన్నారు. సిపిఎం నగర కన్వీనర్‌ పలివెల వీరబాబు మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. మతోన్మాద చర్యలతో ప్రజల ఐక్యతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో సిపిఎం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచార ఆందోళన కార్యక్రమాలను కాకినాడ నగరం లో ప్రజలంతా ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణ, దుంపల ప్రసాద్‌, కె.నాగజ్యోతి, నర్ల ఈశ్వరి, నాగాబత్తుల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.