Nov 23,2022 22:47

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
        కేంద్రంలో బిజెపిని తరిమికొట్టి, రాష్ట్రంలో వైసిపిని బంగాళాఖాతంలో కలపాలని, లేకుంటే రాష్ట్రం అధోగతి పాలవుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. బుధవారం పార్టీ జిల్లా సమితి విస్తృతస్థాయి సమావేశం స్థానిక రోటరీ క్లబ్‌ కమ్యూనిటీ హాల్లో సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షతన జరిగింది. తొలుత పార్టీ జెండాను రాష్ట్ర సమితి సభ్యులు చలసాని వెంకటరామారావు ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండా అమలు చేస్తుందని, అదో మతోన్మాద, అభివృద్ధి నిరోధక పార్టీ అని విమర్శించారు. దేశంలో మైనార్టీలను భయబ్రాంతులకు గురి చేస్తూ మతోన్మాదమే ఎజెండాగా అమలు చేస్తున్నారన్నారు. ప్రమాదకర రాజకీయాలు చేస్తూ తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను కూల్చడమే ధ్యేయంగా మోడీ పాలన సాగిస్తున్నారన్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో ఫిరాయింపులు ప్రోత్సహించడం ద్వారా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చి బిజెపి దొడ్డిదారిన అధికారం చేపట్టిందని విమర్శించారు. కమ్యూనిస్టులు ఏకంకావాలని లౌకిక శక్తులు, ప్రజాతంత్రవాదులను కలుపుకుని వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో సిఎం జగన్‌ పాలన గాలికి వదిలేశారని విమర్శించారు. మూడున్నర సంవత్సరాల కాలంలో ప్రజల వద్ద నుండి గానీ రాజకీయ పార్టీల నుండి ఒక్క విజ్ఞాపన పత్రం కూడా తీసుకొని అసమర్థ ముఖ్యమంత్రి జగన్‌ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో తన సొంత బ్రాండ్ల మద్యాన్ని విస్తతంగా విక్రయిస్తూ కోట్లాది రూపాయలను వెనకేసుకుంటున్నారన్నారు. ఇసుక మాఫియా రాజ్యమేలుతూ ఇసుక కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, ప్రాజెక్టు నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం, వెనుకబడిన ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు, కడప ఉక్కు కర్మాగారం తదితర సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం జగన్‌కు లేవన్నారు. ఇటీవల ప్రధాని మోడీ విశాఖపట్నంలో రాష్ట్ర సమస్యలపై కనీస ప్రస్తావన చేయకపోవడం మోడీ అహంకార వైఖరికి నిదర్శనమన్నారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడుతూ కమ్యూనిస్టుల బలోపేతంతోనే రాష్ట్రానికి విముక్తి అన్నారు. యువజన, విద్యార్థి విభాగాలపై దృష్టి సారించి పటిష్టపరచడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలన్నారు. రైతు సమస్యలపై కార్యాచరణ రూపొందించి రైతు ఉద్యమం చేపట్టాలన్నారు. మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ వచ్చేనెల 26వ తేదీన కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాడవాడలా ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో రైతు, విద్యార్థి యువజన సంఘాల్లో కమిటీలు వేయాలన్నారు. పార్టీ సభ్యత్వాలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌, పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు భత్తుల వెంకటేశ్వరరావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.