ప్రజాశక్తి - పెదవేగి
కోట్లాది మంది గ్రామీణ పేదలకు పట్టెడన్నం పెడుతున్న ఉపాధిహామీ చట్టం బిజెపి విధానాలతో నేడు ప్రమాదంలో పడిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ విమర్శించారు. ఉపాధి హామీ పనిలో కూలీలకు కనీస సౌకర్యాలు కలిపించాలని కోరుతూ సోమవారం మండలంలోని లక్ష్మీపురంలో ఉపాధి పని చేస్తున్న చెరువు వద్ద కూలీలతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామకష్ణ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ఉపాధిహామీలో నేషనల్ మొబైల్ మోనటరింగ్ ఫొటో సిస్టం, రెండు పూటలా పని విధానం తీసుకువచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ఉపాధి కూలీలకు తీవ్ర నష్టం కలుగుతుందని మండిపడ్డారు. ఈ పథకాన్ని ఎత్తివేసేందుకు బిజెపి చేసిన అనేక కుట్రల్లో భాగంగా కూలీలకు వేతనాలు, సమ్మర్ అలవెన్స్, మేట్ల పారితోషకం, ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ వేధింపులకు పాల్పడుతుందని వివరించారు. 2020లో కరోనా సమయంలో పేదల ఆకలిచావులు సంభవించకుండా కాపాడిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్‌లో బిజెపి రూ.30 వేల కోట్ల నిధులు తగ్గించి ఉపాధి హామీ పీక నొక్కిందన్నారు. అంటే ఏడాదికి కుటుంబానికి 22 పనిదినాలకు మాత్రమే ఆ నిధులు సరిపోతాయన్నారు. దీన్నిబట్టి బిజెపి పేదల పట్ల ఎలాంటివైఖరితో ఉందో అర్థమవుతుందన్నారు. బిజెపి విధానాలకు రాష్ట్రప్రభుత్వం వత్తాసు పలుకుతుందని మండిపడ్డారు. ఉపాధిహామీలో నేషనల్ మొబైల్ మోనటరింగ్ ఫొటో సిస్టంను వెంటనే రద్దు చేయాలని కోరారు. రెండు పూటలా పని విధానం రద్దు చేయాలన్నారు. సమ్మర్ అలవెన్సు, పే స్లిప్‌లు, ఇతర సౌకర్యాలు అమలు చేయాలని కోరారు. పని ప్రదేశాల్లో ఆశా, ఎఎన్‌ఎంలను నియమించాలన్నారు. కుటుంబానికి 200 పనిదినాలు, రూ. 600 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి పనుల్లో యంత్రాలు, కాంట్రాక్టర్లను నిషేధించాలని, అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సైట్‌సూపర్‌వైజర్లకు పారితోషికం ఇవ్వాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పనుల విస్తరణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, ఫీల్డు అసిస్టెంట్లపై రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు.










