ప్రజాశక్తి-సామర్లకోట స్వార్థ రాజకీయాల కోసం దేశంలో బిజెపి మత చిచ్చు పెడుతోందని, విదేషాలు రగిలిస్తున్న మతోన్మాద బిజెపికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కరణం ప్రసాదరావు అన్నారు. ఆదివారం స్థానిక బళ్ల మార్కెట్ సెంటర్‌లో బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆదివారం చేపట్టిన ప్రచార బేరి ముగింపు సమావేశంలో ప్రసాదరావు మాట్లాడుతూ.. బిజెపి పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ కూటమి విచ్ఛిన్న రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని అన్నారు. బిజెపి అధికారంలోకి రాకముందు రాష్ట్రానికి అనేక హామీలనిచ్చినా అధికారంలోకి వచ్చాక విస్మరించిందని విమర్శించారు. బిజెపి విచ్ఛిన్నకర విధానాలకు వ్యతిరేకంగా సాగే పోరాటాల్లో ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. దేశంలోని బడా కార్పొరేట్ సంస్థలకు వివిధ రూపాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను అప్పజెప్పి దేశ ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా కార్పొరేట్లకు బిజెపి అందించడం దారుణమన్నారు. నాడు అనేకమంది త్యాగదనులు బ్రిటిష్ వలస పాలనను ఎదిరించి తరిమికొట్టి మనకు స్వాతంత్రం తీసుకువచ్చారని, నేడు అదే స్వాతంత్రం ప్రమాదంలో పడిందన్నారు. దాన్ని కాపాడుకోవడానికి జాతీయ ఉద్యమ స్ఫూర్తితో మళ్ళీ ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. రోజు రోజుకూ పేద ప్రజలపై మోపుతున్న నిత్యవసర ధరలను అదుపు చేయాలని లేకుంటే సామాన్యుని జీవనం మరింత భారంగా తయారవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి బాలం శ్రీనివాస్, కరణం శ్రీనివాస్, కొత్తూరు తులసీదాస్ భక్తుల బాలాజీ కరణం సత్యనారాయణ, సైపురెడ్డి యువరాజు, బాలం ప్రవీణ్, కోన శీను, కరణం రామకష్ణ, సిహెచ్.మహేష్ తదితరులు పాల్గొన్నారు.










