Aug 01,2023 00:06

నర్సీపట్నంలో ఆందోళన చేపడుతున్న క్రైస్తవులు

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌: మణిపూర్‌ రాష్ట్రంలో గత రెండు నెలలుగా క్రైస్తవులపై సాగుతున్న దాడులు, అరాచకాలకు నిరసనగా సోమవారం నర్సీపట్నంలో క్రైస్తవ సంఘాలు గళమెత్తాయి. క్రైస్తవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ఎత్తున శాంతి ర్యాలీ, మానవహారం నిర్వహిం చారు. స్థానిక సిబిఎం కాంపౌండ్‌ నుండి సిఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ వరకు ర్యాలీ చేపట్టారు. ర్యాలీగా నడుస్తూ ప్రతి కూడలిలో శాంతి ప్రార్థనలు చేశారు. స్థానిక అబిద్‌ సెంటర్‌, శ్రీ కన్య కూడలిలో మానవహారాలు ఏర్పాటు చేశారు. మణిపూర్‌ రాష్ట్రంలో శాంతి నెలకొల్పాలని, రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. అనంతరం రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా క్రైస్తవ సంఘాల నాయకులు మాట్లాడుతూ, మణిపూర్‌ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం సహకారంతో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. క్రైస్తవ బిడ్డలను అన్యాయంగా చంపేశారని, మహిళలను నగంగా ఊరేగించారన్నారు. దైవ సేవకులను పొట్టన పెట్టుకున్నారని, చర్చిలను కూల్చివేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన వారందరికీ సత్వర న్యాయం అందించాలన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి అక్కడ ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బిషప్‌ జీవన్‌ రారు, ఈఎస్‌ ప్రమోద్‌ కుమార్‌, ఎం.కృప సెల్వన్‌ ( కొండలరావు), పాస్టర్లు ప్రేమ్‌ కుమార్‌, పి.బెంజిమెన్‌, ఎల్‌.అర్జునరావు, పీలా వెంకటలక్ష్మి (విశాఖ) అమృతవల్లి, బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ నాగరాజు పాల్గొన్నారు.
ఆరిలోవ : మణిపూర్‌ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా విశాఖ మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ థ్రిఫ్ట్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీ ఆధ్వర్యాన సోమవారం పెద్ద ఎత్తున మహిళలు నిరసన ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ ఆరిలోవ కాలనీ నుంచి టిఐసి పాయింట్‌ మీదుగా బాలాజీనగర్‌, తోటగరువు పెదగదిలి కూడలి వరకు ర్యాలీ చేశారు. బిఆర్‌టిఎస్‌ రోడ్డు పెదగదిలి కూడలిలో మహిళలు మానవహారం నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఆన్‌ మరియా, సిస్టర్‌ అనిత, సిస్టర్‌ నిర్మల, సిస్టర్‌ రోజ్‌ జోస్‌, సిస్టర్‌ సునీత పాల్గొన్నారు.