ప్రజాశక్తి-ఆదోనిరూరల్
మోడీని గద్దె దింపుదాం.. దేశాన్ని రక్షించుకుందామని సిపిఎం, సిపిఐ నాయకులు కోరారు. గురువారం మండలంలోని విరుపాపురం, కడితోట, జి.హోసళ్లి గ్రామాల్లో ప్రచార భేరి నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కె.లింగన్న, సిపిఐ మండల కార్యదర్శి బసాపురం గోపాల్ మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలపై భారాలు వేస్తూ కార్పొరేట్లకు రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. 'వంద రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తాం. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం. విదేశాల్లో ములుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తాం' అని ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని మండిపడ్డారు. జిఎస్‌టి పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్నారని తెలిపారు. వచ్చే 2024 ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కోరారు. సిపిఐ మండల సహాయ కార్యదర్శి నరసప్ప, సిపిఎం మండల కమిటీ సభ్యులు తిక్కప్ప, అంజిత్ కుమార్ గౌడ్, సిపిఎం మండల నాయకులు తిక్కన్న, దావీదు, చిరంజీవి, భీమాంజనేయులు, వీరేష్ పాల్గొన్నారు.
ఆదోనిలో ప్రచార భేరి నిర్వహిస్తున్న నాయకులు










