Oct 30,2023 22:51

ప్రజాశక్తి - దేవరపల్లి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అను సరిస్తున్న నయా ఫాసిస్టు విధానాలను తిప్పికొట్టాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్‌ పిలుపు నిచ్చారు. సిఐటియు దేవరపల్లి మండలం జనరల్‌ బాడీ సమావేశం సోమవారం ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టిపి లక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అరుణ్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని ఆశ పెట్టి నిరుద్యోగులను మోసం చేశారని విమర్శంచారు. దేశంలోని ప్రభుత్వ రంగ ఆస్తులను, సహజ వనరులను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారన్నారు. రూ.12 లక్షల కోట్లు రుణమాఫీలను కార్పొరేట్లకు చేయడం ద్వారా మోడీ కార్పొరేట్లకు సేవకుడినిఅని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.సుందర బాబు మాట్లాడుతూ కార్మికుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం కేంద్రంలో ఉంద న్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా అంగన్వాడీలకు గ్రాడ్యుటీ అమలు చేయాలని, స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. రైతు సంఘం సీనియర్‌ నాయకులు ఉండవల్లి కష్ణారావు, సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌.భగత్‌ మాట్లాడారు. సిఐటియు నాయకులు కె.రత్నాజీ, గుంటూరు వరలక్ష్మి, రాజకుమారి, మరపట్ల ఇందిరా, వేల్పూర్‌ దుర్గారావు, అయినపర్తి శ్రీనివాసరావు, గ్యాలం సత్యనారాయణ, రైతు సంఘం నాయకులు పిన్నమన సత్యనారాయణ, ఆచంట సుభాష్‌ చంద్రబోస్‌, తదితరులు పాల్గొన్నారు.