Aug 30,2023 21:16

గుమ్మలక్ష్మీపురం మండలం బొడ్లగూడ, సీతంపేటలో సంతకాలు సేకరిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు,

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం సమరభేరి కార్యక్రమంలో భాగంగా మండలంలోని మారుమూల ప్రాంతమైన బొడ్లగూడలో బుధవారం సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోడీ సర్కార్‌ కార్పొరేట్‌ శక్తులకు పరిశ్రమల పేరుతో విచ్చలవిడిగా అనుమతులిస్తూ గిరిజనులను అడవి నుంచి దూరం చేసే కుట్ర పన్నుతున్నారని తెలిపారు. రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులు, చట్టాలను నిర్వీర్యం చేస్తూ గిరిజన జీవన విధానంపై పాలకులు దాడి చేస్తున్నారని విమర్శించారు. గిరిజనుల హక్కులు రక్షణకై ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా తలపెట్టిన సమరభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గ్రామ గ్రామానికి వెళ్లి ప్రజలను సంతకాల సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. మంగళవారం రాత్రి దుడ్డుఖల్లు, మేదరగండ గ్రామాల్లో సమరభేరి కార్యక్రమంపై సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు మండంగి శ్రీనివాసరావు, సూర్యం, వెంకటరావు తదితరులు ఉన్నారు. అలాగే ఇరిడి, సప్ప గూడ, మల్లు, ఇచ్చాపురం, పెద్ద ఖర్జ, గ్రామాల్లో సిపిఎం మండల కార్యదర్శి కోలక అవినాష్‌ ప్రచారం నిర్వహించారు. సమరభేరి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
కురుపాం : మండలంలో గుమ్మడి గూడ, దండుసూర, షేక్‌ పాడు, తేనుఖరజ, గొటివాడ, నేరెళ్లవలస, దురిబిలి గిరిజన గ్రామాల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, మండల కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు ప్రచారం, సభలు సమావేశాలు నిర్వహించారు. బుధ, గురువారాలు సంతకాల సేకరణ, సెప్టెంబర్‌ 1న సచివాలయం వద్ద వినతి, 4న తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలో ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు నీలకంఠం, రామారావు, లక్షణ, రమేష్‌, గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం టౌన్‌ : పట్టణంలోని ప్రధాన రహదారిలో సిపిఎం పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యమ్మల మన్మధరావు, జిల్లాకమిటీ గొర్లి వెంకటరమణ, రెడ్డి శ్రీదేవిలు మాట్లాడుతూ సమరభేరికార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్‌ 1న సచివాలయాలముందు, 4న తహశీల్దారు కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాల్లో ప్రజలంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి.సన్యాసిరావు, బి.సూరిబాబు, మాన్యం గౌరీ, గెద్ద తులసి, చొక్కాపు చంద్రమౌళి, వేమకోటి ఈశ్వరరావు, గోవింద పండా, గ్రామస్తులు పాల్గొన్నారు.
సీతంపేట : మండలంలో సమరభేరి కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల పెరిగిన అధిక ధరలు, నిరుద్యోగం, విద్యుత్‌ఛార్జీలకు నిరసనగా సమర భేరి కార్యక్రమంలో మండలంలోని కోసంగిలో సంతకాలు సేకరణ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు ఎం.తిరుపతి రావు, జె.శ్రీరాములు, బి.నీలయ్య తదితరులు పాల్గొన్నారు.
కొమరాడ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మండలంలోని చిన ఖర్జెల పంచాయతీ సీసాడ వలస, బట్టి వలస సర్వపాడు గ్రామాల్లో సమరభేరి కార్యక్రమంపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ నాయకులు కొల్లి సాంబమూర్తి, నాయకులు ఉపేంద్ర, శివుని నాయుడు మాట్లాడారు. కార్యక్రమంలో యువకులు గణేశు గౌర్నాయుడు, పోలినాయుడు, నరేష్‌, చిలకమ్మ తదితరులు ఉన్నారు.
పాచిపెంట : ప్రజా సమస్యలపై సమరభేరి కార్యక్రమం మండలంలోని కోడుమూరు, ఇప్పలవలస, చీడివలస, మెట్టవలసలో సిపిఎం నాయకులు సూకురు అప్పలస్వామి కొర్ర కళ్యాణ్‌ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. సమరభేరి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ఆందోళనలకు ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు పాల్గొన్నారు.
సాలూరు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల పై ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎన్నై నాయుడు కోరారు. సమరభేరి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 6,7,8వార్డుల్లో ప్రభుత్వాల విధానాలపై సంతకాల సేకరణ చేశారు. నిరుద్యోగ యువత కోసం డిఎస్సీ నియామకాలు చేపట్టాలని, పట్టణాల్లో పన్నులు, విద్యుత్‌ ఛార్జీల భారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు టి.రాముడు, సభ్యులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి : మండలంలో సుంకి, నాగూరు, చిలకాంలో సంతకాల సేకరణ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యమ్మల మన్మధరావు, నాయకులు కరణం రవీంద్ర ఆధ్వర్యాన జరిగింది. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గేదెల రామ్మూర్తినాయుడు, ప్రకాశం, సాంబయ్య, శివ, సింహాచలం, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
మక్కువ: కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం సంతకాల సేకరణ చేపట్టింది. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు కొల్లి గంగు నాయుడు, వి.ఇందిర మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజంతా పోరాడాలని, బుధ, గురువారాలు సంతకాల సేకరణ చేసి సెప్టెంబర్‌ 1న సచివాలయం వద్ద, 4న మండల కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్‌ టి.ప్రభాకర్‌, నాయుకులు పిట్టల సీతారాం, దాడి సింహాచలం, బిరుసు పాల్గొన్నారు.