Apr 25,2023 00:46

సామర్లకోటలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న సిపిఎం నాయకులు

 

ప్రజాశక్తి - సామర్లకోట
బిజెపి ప్రభుత్వం దేశంలో అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ప్రచార భేరి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మెహర్‌ కాంప్లెక్స్‌ వద్ద నుండి ఈ ప్రచార భేరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ప్రసాదరావు మాట్లాడుతూ దేశంలోని ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని బిజెపి దుర్మార్గపు ఆలోచనలతో సామాన్యుల పరిస్థితి రోజురోజుకు దిగజారి పోతోందని అన్నారు. కేవలం కార్పొరేట్లకు మాత్రమే మేలు చేస్తూ సామాన్యులకు హాని చేస్తున్న బిజెపి విధానాలను ప్రతి ఒక్కరు తిప్పికొట్టాలని అన్నారు.
అందరి ఉమ్మడి సంపదగా ఉన్న బ్యాంకుల్ని మనం కట్టిన పన్నులతో నిర్మించిన ప్రభుత్వంగా పరిశ్రమలను వాడరేవులను ఆఖరికి మనందరికీ అన్నం పెట్టే వ్యవసాయాన్ని సైతం కార్పొరేట్లకు అమ్మేస్తున్న మోడీని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని అన్నారు. ప్రజల మధ్య విద్వేష మతతత్వ చిచ్చులను రాజేసి మైనార్టీలకు భరోసా కల్పించాల్సింది పోయి వారిని దేశంలోనే లేకుండా మోడీ బుల్డోజర్‌ రాజకీయాలు నడుపుతున్నారని అన్నారు. దేశాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని అన్నారు.
రానున్న ఎన్నికలలో బిజెపికి అంటగాగుతున్న పార్టీలను వ్యతిరేకించాలని అన్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న నిత్యావసర ధరలకు అదుపు చేయలేని చేతకాని ప్రభుత్వం బిజెపినే అని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి కరణం శ్రీనివాస్‌ నాయకులు పవన్‌, ఐటీ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.