Oct 23,2022 23:24

సిపిఎం సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కమిటీ సభ్యుడు నాగేశ్వరరావు

సిపిఎం సమావేశంలో జిల్లా కమిటీ సభ్యుడు నాగేశ్వరరావు
ప్రజాశక్తి -విఆర్‌.పురం:
మోడీ నేతృత్వంలోని కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలందరూ ఐక్య ఉద్యమం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మేకల నాగేశ్వరరావు, మండల కార్యదర్శి పాయం సీతారామయ్య పిలుపునిచ్చారు. ఆదివారం కూనవరం మండలంలోని కూటురు పంచాయతీలో నిర్వహించిన సిపిఎం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ 2014లోఅధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, మతోన్మాద విధానాలతో కార్పొరేట్‌ సంస్థలకు ఊడిగం చేస్తోందన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా అంటూ స్థానిక పరిశ్రమలను ప్రోత్సాహించాల్సిందిపోయి, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వంటి పరిశ్రమలతోపాటు బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసి, పోర్టులు వంటి సంస్థలను ప్రయివేటకు దారాదత్తం చేస్తోందని మండిపడ్డారు. ఒకే దేశం, ఒకే పన్ను విధానంతో పన్నులు తగ్గి, ధరలు అదుపులోకి వస్తాయని నమ్మబలికి జిఎస్‌టిని అమల్లోకి తెచ్చి ప్రజలపై మరిన్ని భారాలను మోపుతోందని దుయ్యబట్టారు. వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ వంటి వాటి ధరలను విపరీతంగా పెంచి, ప్రజల నడ్డి విరిచారని, నల్లధనాన్ని వెలికితీసి, దాన్ని ప్రజలకు పంచుతామని నమ్మబలికి, బ్లాక్‌మనీని సైతం వైట్‌ చేసి, అవినీతిపరులకు దేశ సంపదను కట్టబెట్టారన్నారు. బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మన్యవాసులకు అండగా ఉన్న గిరిజన చట్టాలను తూట్లు పొడిచి, ఏజెన్సీలోని గనులు, ఇతర సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తోందన్నారు. ఆదివాసీలను బలహీనపరిచేందుకే 52 జిఒ ద్వారా వాల్మీకి, బోయ, బెంతు ఒరియా తెగలను ఎస్‌టిల్లో కలపాలని చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వైస్‌ ఎంపిపి కొమరం పెంటయ్య, తల్లూరి. శ్రీనివాసరావు. పాయం సత్యనారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు