
ప్రజాశక్తి-తాడేపల్లి : వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి మత భావాలను జొప్పిస్తున్న కేంద్రంలో పరిపాలన సాగిస్తున్న బిజెపి ప్రభుత్వం దిగిపోవాల్సిందేనని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గలో సిపిఎం చేపట్టాన ప్రజా చైతన్య పాదయాత్రను ఆయన తాడేపల్లిలోని ఉండవల్లి సెంటర్‌లో మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిపిఎం తాడేపల్లి పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. గఫూర్ మాట్లాడుతూ ప్రజలను విస్మరించి అధికారం కోసం ప్రధాన రాజకీయ పక్షాలు వెంపర్లాడుతున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై సిపిఎం నికరంగా పోరాడుతోందని, పాదయాత్ర అందులో భాగమని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పోలవరంలో లక్షలాది మంది ప్రజలను ముంచారని, భుములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇంకా ఇవ్వలేదని విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు ఇంటి సౌకర్యంతో పాటు భూమి, వైద్యం అందే విధంగా చూడాలన్నారు. ఇటీవల సిపిఎం పాదయాత్ర చేసిన తరువాత కొంత కదలిక వచ్చిందని గుర్తు చేశారు. కమీషన్ల కక్కుర్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు ఆడుతోందని ఎద్దేవ చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నుండి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదని, ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కేటాయించకుండా, రాష్ట్రం పట్టించుకోకుండా ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. విశాఖ రాజధాని అంటూ, అక్కడికి వెళ్తానంటూ మూడేళ్ల నుండి చెబుతున్న జగన్ తాడేపల్లిలోనే ఉంటూ రాజధానిపై రకరకాల డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపికి వైసిపి, టిడిపి ఎందుకు మద్దతిస్తున్నాయని ప్రజలు ప్రశ్నించాలన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీ విధానాలు మార్చడానికి లౌకికశక్తులు, వామపక్షాలు మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ ఇవ్వలేదని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎటు పోయాయో తెలియదని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సిఎం మూడు రాజధానులు అంటుంటే ప్రధాన మంత్రి నోరు ఎందుకు మెదపడంలేదని ప్రశ్నించారు. మూడు రాజధానులు కాదు 30 రాజధానులు పెట్టుకోవాలని బిజెపి నాయకులు జివిఎల్ నరసింహారావు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఇప్పటి వరకు వెనకబడిన రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కూడా పెట్టలేదని, ఉద్యోగావకాశాలు లేవని అన్నారు. రాజశేఖరరెడ్డి సిఎంగా ఉన్నప్పుడు కనీసం ప్రజల సమస్యలు వినేవారని, అయితే జగన్ మాత్రం నియంత పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయాలని, అన్ని పార్టీలు అందుకు కట్టుబడి ఉండాలని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కారం అయ్యేంత వరకు పోరాడడం పాదయాత్ర ఉద్దేశమని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో 30 వేల మందికి ఇళ్లస్థలాలు ఇప్పించి ఇళ్లు వేయించిన ఘనత సిపిఎంకే దక్కుతుందన్నారు. పాలకులు శుష్ట వాగ్దానాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతుంటే అందుకు భిన్నంగా సిపిఎం చెప్పిందే చేస్తుందని అన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ, పోరంబోకు, ఇరిగేషన్ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు ఎక్కడ ఉన్న వారికి అక్కడే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివాదంలో ఉన్న రాజధాని భూములను సెంటు స్థలం చొప్పున పేదలకు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కోర్టు తీర్పుల పేరుతో సెంటు స్థలం వస్తుందో రాదో తెలియని త్రిశంకు స్వర్గంలో ప్రజలు ఉన్నారని చెప్పారు. రైల్వే స్థలాన్ని ప్రభుత్వం డబ్బు చెల్లించి రెవెన్యూ పోరంబోకుగా మార్పుచేసి పట్టాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని అనంతరపురం తదితర జిల్లాల్లో ఈ విధంగా చేశారని గుర్తు చేశారు. తాడేపల్లి ప్రాంతంలో వాగు మరమ్మతుల గురించి పట్టించుకోవడంలేదని, శ్మశాన స్థలాల సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు.
సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ వరకు పాదయాత్ర జరుగుతుందని, 16వ తేదీన మంగళగిరి ఎంటిఎంసి కార్యాలయం ముందు జరిగే ధర్నాలో పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎంఎ చిష్టి, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.రవి, ఇ.అప్పారావు, ఎస్‌ఎస్ చెంగయ్య, సీనియర్ నాయకులు జొన్నా శివశంకరరావు, జెవి రాఘవులు, తాడేపల్లి మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డి, నాయకులు డి.శ్రీనివాసకుమారి, కె.శివరామకృష్ణయ్య, ఎం.పకీరయ్య పాల్గొన్నారు.
ప్రజల్ని పలకరిస్తూ.. సమస్యలు వింటూ...
పాదయాత్రలో నాయకులు ప్రజలు చెప్పిన సమస్యలు వింటూ ముందుకు సాగుతున్నారు. వివిధ సెంటర్లలో ప్రజలు తమ ఇళ్ల ముందుకు వచ్చిన నాయకులను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు. మధ్యలో వ్యాపారస్తులు పలకరించి వారి బాగోగులు గురించి అడిగి తెలుసుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్వాతంత్య్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చపల్లి సుందరయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా గ్రామాల్లో అరుణ పతాకాలను ఆవిష్కరించారు. మంగళవారం ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం గ్రామాలతో పాటు తాడేపల్లి పట్టణంలోని డోలాస్‌నగర్ వరకు పాదయాత్ర సాగింది. రాజధాని పారిశుధ్య కార్మికులు తమకు నెలనెలా జీతాలు సక్రమంగా వచ్చే విధంగా చూడాలని వినతిపత్రం అందజేశారు. పుష్కర కాలనీ బాధితులు తాము ఉండే చోటే స్థలాలకు పట్టాలివ్వాలని వినతి పత్రాలు ఇచ్చారు.
జోరు వానలోనూ పాదయాత్ర
ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ : ప్రజా చైతన్య పాదయాత్ర మంగళగిరి మండలం రాజధాని గ్రామమైన ఎర్రపాలెంలో జోరువానలోనూ సాగింది. ఎర్రబాలెంలో చిన్నపాటి వర్షానికి డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తున్నదని బృంద సభ్యులు గుర్తించారు. కాల్వల నిర్మాణం సరిగా లేక మురుగు నీరంతా రోడ్లపైకి వచ్చి చేరుతోందని చెప్పారు. ఇండిస్టియల్ ఏరియా, కొండ పోరంబోకు, ఫారెస్ట్ ఏరియాల్లో 50 ఏళ్లకు పైగా ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్నారని వారందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని స్థానికులు వాపోయారు. బసవతారక నగర్‌లోనూ ఇళ్ల పట్టాల సమస్య తీవ్రంగా ఉందని పాదయాత్ర బృందానికి స్థానికులు తెలిపారు.
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో రైతులకు, అసైన్డ్ రైతులకు ఇవ్వవలసిన కౌలును నేటికీ ఇవ్వలేదన్నారు. అసైన్ రైతులకు రెండేళ్ల నుండి కౌలు అందడం లేదన్నారు. మే నెలలో ఇవ్వవలసిన కౌలు నేటికీ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. పారిశ్రామిక వాడలో కనీస మౌలిక వసతులు కల్పించి పారిశ్రామికవాడ అభివృద్ధికి, ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతన చట్ట ప్రకారం రూ.21 వేల వేతనాన్ని అందించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో గాంధీ విగ్రహానికి సిపిఎం రాష్ట్ర నాయకులు సూర్యారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం జెండాను ఎస్.రామరాజు ఆవిష్కరించారు.
పారిశుధ్య కార్మికుల వినతి
తమ గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసినా తమకు వేతనాలను మాత్రం నామమాత్రంగానే ఇస్తున్నారని పారిశుధ్య కార్మికులు వాపోయారు. ఈ మేరకు పాదయాత్ర బృందానికి వినతిపత్రం ఇచ్చారు. రూ.12 వేల జీతంతో కుటుంబాలు గడవడం కష్టమవుతోందని, తమను ఆప్కాస్‌లో చేర్చి కనీస వేతనాన్ని అమలు చేయాలని కోరారు. కనీసం సబ్బులు, నూనె, యూనిఫాం, చెప్పులు వంటివి కూడా ఇవ్వటం లేదన్నారు. రూ.15 వేలు జీతం, రూ.6 వేలు మెడికల్ అలవెన్స్ కలిసి రూ.21 వేలు ఇవ్వాలని కోరారు. పాదయాత్రలో నాయకులు వి.దుర్గారావు, ఎం.భాగ్యరాజు, వి.వెంకటేశ్వరరావు, జి.కృష్ణ, కె.ఆంజనేయులు, జి.నాగేశ్వరరావు, బి.బోస్, ఎం.బాలాజీ, ఎస్.వెంకటనారాయణ, వై.కమలాకర్, ఎస్.రాధిక పాల్గొన్నారు. పాదయాత్రకు ముందుగా ప్రజానాట్య మండలి కళాకారులు ప్రత్యేక గేయాలను ఆలపించారు.