ప్రజాశక్తి - మార్టురు రూరల్ : ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని సాగనంపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్. మజుందర్ తెలిపారు. బిజెపి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రచార భేరి నిర్వహించారు. రైతు సంఘం నాయకుడు కందిమళ్ల రామకోటేశ్వరరావుతో ప్రచారం నిర్వహించారు. బిజెపి విధానాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంజుదర్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వ విధానాలవల్ల అలుముకుంటున్న చీకట్ల నుంచి బైటపడటానికి ప్రజలు ఉద్యమించాలని కోరారు. మైనారిటీలు,దళితులు. గిరిజనులు,మహిళలు,అణగారిన వర్గాల రక్షణ కోసం,ప్రజాస్వామ్య హక్కులకోసం,పౌరహక్కుల రక్షణ కోసం విశాల ఐక్య ఉద్యమాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల పాలిట పీడకలగా మారిన కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలను ఓడించి దేశ స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు బత్తుల హనుమంతరావు రైతుసంఘం నాయకులు బొడెంపుడి సూరిబాబు, ఎనికపాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
బహిరంగ సభను జయప్రదం చేయాలి
సంతనూతలపాడు రూరల్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసనగా ఈనెల 30న వామపక్షాల ఆధ్వర్యంలో సంతనూతలపాడులో ప్రచార భేరి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ప్రచారభేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నెరుసుల వెంకటేశ్వర్లు, కోదాటి కోటేశ్వరరావు, సంపత్ కుమార్ , బంకా పద్మ తదితరులు పాల్గొన్నారు.










