ప్రజాశక్తి- కూనవరం
కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం చేయాలని సిపిఎం ఎఎస్‌ఆర్ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం, సిపిఐ కేంద్ర కమిటీల పిలుపు మేరకు జరుగుతున్న ప్రచార భేరి వాల్ పోస్టర్లను మండలంలోని ముల్లూరు గ్రామంలో స్థానికులతో కలిసి బుధవారం కిరణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంకు నిధులు, నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా మోసం చేస్తుందని విమర్శించారు. దీనిపై రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం నోరు మెదపకపోవడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో బాబు బొర్రయ్య, సర్పంచ్ నాగమణి, తమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో ప్రచార భేరి
ప్రచార భేరి కార్యక్రమం కూనవరం మండలంలోని కూటూరు, లింగాపురం, అభిచర్ల గ్రామాల్లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయకుండా నిర్వీర్యం చేయడానికి కుట్ర చస్తుందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు, నాయకులు పాయం జ్యోతి, సోడే శంకర్, సర్పంచ్ వెంకమ్మ, మాజీ సర్పంచ్ రవ్వ ప్రసాద్, రాజు, సోడే రత్తయ్య పాల్గొన్నారు.
గోదావరి వరద ముంపు గ్రామాలను పోలవరం జాబితాలో చేర్చాలి
ఎటపాక : ప్రచార బేరి కార్యక్రమం బుధవారం మండలంలోని మురుమూరు జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ప్రాజెక్టు పునరావాసానికి కావాల్సిన నిధులను కేంద్రం నుండి రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేయడం లేదన్నారు. 41.15 మీటర్ల వరకే ప్రస్తుత నిర్మాణమని కేంద్రం చెబుతున్న నేపథ్యంలో 45.72 కాంటూరు లెవెల్ ముంపునకు గురయ్య గ్రామాలకు పునరావాసం కల్పించదని తేటతెల్లమైందని చెప్పారు. ప్రతి ఏటా గోదావరి వరదలకు మురుమూరుతో పాటు మండలంలోని పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, ఈ గ్రామాలను 41.15 కాంటూరులో చేర్చి నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ ఇప్పించాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితులకు మొండి చేయి చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మే 4న చింతూరులో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు డేగల మాధవరావు, పులుసు బాలకృష్ణ, ఆకిశెట్టి రాము, సోయం వీరమ్మ పాల్గొన్నారు.
తాగునీటి సమస్యలను పరిష్కరించాలి
విఆర్.పురం : మండలంలోని ప్రచార భేరి కార్యక్రమం బుధవారం తెల్లవారి గూడెం, కారంగూడెం, గుల్లెట్ వాడ గ్రామాల్లో సిపిఎం కార్యదర్శి సోయం చిన్నబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి ఇంటికి కరపత్రాలు ఇచ్చి వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఉపాధి హామీ పని ప్రదేశానికి వెళ్లి కూలీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చిన్నబాబు మాట్లాడుతూ కారం గూడెం గ్రామంలో తాగునీరు సమస్య ఎక్కువగా ఉందని, బోరువేసి మోటార్ కలెక్షన్ ఇవ్వలేదని తెలిపారు. ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రజాస్వామ్య విలువలకు పాతరెస్తున్న బీజేపీ విధానాలను ప్రజలందరూ వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం బీజేపీకి పూర్తిగా లొంగిపోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వడ్లది రమేష్, కుంజ నాగిరెడ్డి, కార్యకర్తలు తెల్లం కన్నారావు, సత్తిరాజు, సున్నం కోటప్ప ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
మోడీతో ఆదివాసీలకు ముప్పు
పాడేరు : ప్రధాని మోడీ అవలంభిస్తోన్న విధానాలతో గిరిజనులకు ముప్పు వాటిల్లుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బోనంగి చిన్నయ్య పడాల్ విమర్శించారు. మండలంలోని గుర్రగరువు గ్రామంలో బుధవారం సిపిఎం, సిపిఐ ప్రచార బేరి యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలను చాటి చెప్పి ప్రజల్లో చైతన్యం నింపేందుకు సిపిఎం, సిపిఐ సంయుక్తంగా ప్రచార బేరి యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని సామాన్యుల జీవన స్థితిగతులు పూర్తిగా దిగజారాయన్నారు. రైతులు పండించే పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించ లేదని తెలిపారు. గిరిజన ప్రాంతంలో ప్రత్యేక హక్కులు, చట్టాలను పరిరక్షించుకోవడానికి పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. సిపిఎం మండల నాయకులు పాలికి లక్కు. ఎల్.సుందర్‌రావు పాల్గొన్నారు.
25న బహిరంగ సభను జయప్రదం చేయండి
డుంబ్రిగూడ : ఈనెల 25న పాడేరులో నిర్వహించే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం కించమండ వారపు సంతలో సిపిఎం, సిపిఐ ప్రచార బేరి జీపుజాతా నిర్వహించారు. ఈ సందర్భంగా సంత నుంచి కించమండ పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కరపత్రాలను పంచుతూ విస్తతంగా ప్రచారం చేపట్టారు. అనంతరం సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి ఎస్‌బి పోతురాజు మాట్లాడుతూ, జీవో 3ను రద్దు చేయడంతో పాటు 1/70 భూబదాలాయింపు చట్టానికి చట్టానికి వ్యతిరేకంగా హైడ్రోపవర్ ప్రాజెక్టును నిర్మించడానికి బిజెపి ప్రభుత్వం పునుకుంటుందని చెప్పారు. గిరిజనులకు, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపిని గద్దె దింపడానికి గిరిజనులు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 29 జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.సూర్యనారాయణ, సిపిఎం మండల నాయకులు పి.సత్యనారాయణ, పి డుంబు, గిరిజన సంఘం నాయకులు తిలక్, జగన్నాథం పాల్గొన్నారు.










