ప్రజాశక్తి - గుంటూరు : కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య విభజనను సృష్టిస్తోందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.రఘు అన్నారు. ఆ పార్టీ కార్యకర్తలకు బ్రాడీపేట 2/7లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో రెండ్రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు వివరాలను ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాశం రామారావు వెల్లడించారు. రెండరోరోజైన ఆదివారం 'మతతత్వ రాజకీయాలు-ప్రతిఘటనా పద్ధతులు' అంశంపై ఆర్.రఘు మాట్లాడుతూ భారత రాజ్యాంగ లౌకిక స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలకే కేంద్ర ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. విద్యారంగంలో సిలబస్‌లో ఆశాస్త్రీయమైన అంశాలను ప్రవేశపెట్టి శాస్త్ర సాంకేతిక రంగాలను దెబ్బతీస్తున్నారని, కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య గొడువులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. భారత రాజ్యాంగ లౌకిక స్ఫూర్తిని కాపాడుకునేందుకు అభ్యుదయ వాదులంతా ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజి, కె.నళినీకాంత్, ఎం.రవి, ఎస్‌ఎస్.చెంగయ్య, నాయకులు ఎల్.అరుణ, సుధాకిరణ్ పాల్గొన్నారు.
సర్దుబాటు పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంపు సరికాదు
సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచడం సరికాదని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని రామారావు అన్నారు. శిక్షణా తరగతుల అనంతరం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు అధ్యక్షతన జిల్లా విస్తృత సమావేశం నిర్వహించగా రామారావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు ఛార్జీల పేరుతో యూనిట్‌కు 40పైసలు అదనంగా వసూలు చేస్తోందని, అన్ని వర్గాల ప్రజలపై ఈ భారం పడుతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగి ప్రజల జీవన పరిస్థితులు దుర్భరంగా మారుతున్నాయన్నారు. ఇలాంటి స్థితిలో విద్యుత్ ఛార్జీలు పెంచడం సరికాదన్నారు. పసుపు పంటకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6850 మద్దతు ధర ప్రకటించగా ప్రైవేటు వ్యాపారులు రూ.5 వేలకే కొంటున్నారని చెప్పారు. అధిక వర్షాలకు ఈ ఏడాది దిగుబడి తగ్గడంతోపాటు పెట్టుబడి ఖర్చులూ పెరిగాయ న్నారు. ఈ నేపథ్యంలో పసుపు పంటను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, ఏ గ్రామంలో ఉన్న పేదలకు ఆ గ్రామంలోనే ఇళ్ల స్థలాలివ్వాలని, జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డు కోసం యజమాని సంతకం చేయాలనే నిబంధనలను తొలిగించాలని కోరారు. కౌలు రైతుల సమస్యలపై ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే రాష్ట్ర వ్యాప్త ప్రచార యాత్రలు, పాదయాత్రలను జయప్రదం చేయాలని, చేగువేరా జయంతి సందర్భంగా జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించి సభ నిర్వహించాలని, గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించేందుకు రాష్ట్ర ప్రభు త్వం నిధులు కేటాయించాలని కోరుతూ తీర్మానాలను సమా వేశంలో ఆమోదించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యు లు వై.నేతాజి, ఎన్.భావన్నారాయణ, కె.నళినీకాంత్, ఎం. రవి, ఎస్‌ఎస్ చెంగయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు.










