
- సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.రఘు
ప్రజాశక్తి-గన్నవరం: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్మేసి దేశ ప్రజలను మోసం చేస్తుందని సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.రఘు విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికై గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజారక్షణ భేరి యాత్ర సోమవారం మండలంలో రెండో రోజు కొనసాగింది. చిన్న అవుటపల్లి, తెంపల్లి, బల్లిపర్రు, వీరపనేని గూడెం కొత్తగూడెం, చిక్కవరం, బీబీ గూడెం, గొల్లనపల్లి, గోపవరపు గూడెం, కొండపావులూరు, సావరగూడెం గ్రామాల్లో జరిగిన సభల్లో రఘు మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని కొల్లగొట్టి, బడా కార్పొరేట్ వ్యవస్థలకు తాకట్టు పెడుతోందని విమర్శించారు. చౌకీదార్ అంటూ ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని కారు చౌకగా అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టీవీ లక్ష్మణస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని అన్నారు. నవరత్నాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉండే ప్రాజెక్టులను నిర్మించి, తాగు, సాగునీటిని అందిస్తానని అనేక మాయమాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక రైతులను, ప్రజలను మోసం చేశారని అన్నారు. బిజెపితో పాటు దానిని బలపరుస్తున్న పార్టీలను ఓడించడమే ప్రజల లక్ష్యం కావాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు, ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ యాత్ర సాగుతుందన్నారు. నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు యాత్రలో వివిధ అంశాలపై అధ్యయనం చేసి, పోరాటాలు నిర్వహించేందుకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మల్లంపల్లి ఆంజనేయులు, బేతా శ్రీనివాసరావు, అజ్మీర వెంకటేశ్వరరావు, ఏసుదాసు, రాంబాబు, తాత అబ్బాయి, మహేష్, మిరప నాగేశ్వరరావు, నాగరాజు, నాగలక్ష్మి, చినబాబు, వీర్రాజు, రాము, అరుణ్ పాల్గొన్నారు.