ప్రజాశక్తి-పెందుర్తి : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై అనేక దాడులు జరిగాయని ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు ఆరోపించారు. కారంచేడు అమరవీరుల 35వ వర్థంతిని సోమవారం అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కారంచేడు ప్రజలు మానవ హక్కులు అడిగినందుకే వారిపై దాడి జరిగిందన్నారు. ఈ ఉద్యమంతోనే 1985 చట్టం కూడా అమలులోకి వచ్చిందని తెలిపారు. లక్ష్మీపేటలో దళితులపై హత్యాకాండ జరిగిందని గుర్తు చేశారు. కరోనా సమయంలో సేవలందించిన డాక్టర్లకు కరోనా కిట్టులు లేవన్నందుకే ఆ డాక్టర్‌పై వైసిపి ప్రభుత్వం భౌతిక దాడులు చేసిందని ఆరోపించారు. ప్రజలందరూ సమరశీల పోరాటం చేయడం ద్వారా హక్కులు సాధించుకోగలుగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఒడబ్ల్యు సంఘ సభ్యులు ఇందిర, అరుణోదయ సంఘం సభ్యులు నిర్మల తదితరులు పాల్గొన్నారు.










