ప్రజాశక్తి-సింగ్‌నగర్: కేంద్రంలోని బిజెపి ఎనిమిదేళ్ల పాలనలో దేశం అధోగతి పాలైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గాభవానీ అన్నారు. బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించితేనే దేశానికి రక్ష అన్నారు. సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా విజయవాడ నగరంలో సాగుతున్న ప్రచార భేరిలో భాగంగా మంగళవారం 58వ డివిజన్ కృష్ణ హోటల్ సెంటర్ వద్ద సభ జరిగింది. సభకు సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి భూపతి రమణారావు, సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కెవి భాస్కరరావు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా బాబూరావు, దుర్గాభవానీ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ప్రజల సంపదను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతుందని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను హరిస్తోందన్నారు. కరోనా కష్టకాలంలోనూ ప్రజలపై భారాలు మోపారన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీని ప్రశ్నించని వైసిపి, టిడిపిని ప్రజలు క్షమించరన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా నిధులు, విభజన హామీల అమలు కోసం పోరాడాలన్నారు. ప్రచార భేరి కృష్ణ హోటల్ సెంటర్లో ప్రారంభమై శివాలయం వీధి, పిఅండ్‌టి కాలనీ, డాబా కొట్టల సెంటర్, లునా సెంటర్, లెనిన్ సెంటర్ మీదుగా వాంబే కాలనీ బస్ స్టాప్ సెంటర్‌కు వరకు సాగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డి.కాశీనాథ్, కె.శ్రీదేవి, సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె.దుర్గారావు, టి.ప్రవీణ్, ఎస్ కె పీరుసాహెబ్, సిహెచ్.శ్రీనివాస్, వై.సుబ్బారావు, సిపిఐ నాయకులు లంక దుర్గారావు, నక్క వీరభద్రం, రామరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-విజయవాడ: కేంద్రంలోని మోడీని గద్దెదించాలని కోరుతూ ఈ నెల 23న సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించే పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ కృష్ణలంక 22వ డివిజన్‌లో ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేస్తూ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తూర్పు సిటీ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు బత్తుల చిన్నారావు, నాయకులు తాతా సాంబయ్య, వాజా శ్రీనివాసరావు, టి.తాండవకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-విజయవాడ రూరల్: విజయవాడ రూరల్ మండలం పి.నైనవరం గ్రామంలో ప్రజా వ్యతిరేక నిరంకుశ మతోన్మాద బిజెపిని సాగనంపుదాం దేశాన్ని కాపాడుకుందాం అన్న నినాదంతో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండలం సిపిఎం కార్యదర్శి మాతంగి ఆంజనేయులు, ముదిగొండ కోటేశ్వరరావు, చప్పిడి రాంబాబు, మాతంగి నాగమల్లేశ్వరరావు, ముగుడా సురేష్ పాల్గొన్నారు. ప్రజాశక్తి-వత్సవాయి: మోడీని సాగనంపుదాం... దేశాన్ని కాపాడుకుందాం అంటూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారభేరి వాల్‌పోస్టర్‌ను వత్సవాయి మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తమ్మినేని రమేష్, సిఐటియు మండల కార్యదర్శి బి.రాము, గంగుల వెంకయ్య, కంచర్ల కొండయ్య, భూతపల్లి బిక్షం, పెంటి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి -నందిగామ: నందిగామ గాంధీ సెంటర్లో ప్రచారభేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చనుమోలు సైదులు, సిపిఐ నందిగామ ఏరియా కార్యదర్శి చుండూరు సుబ్బారావు, నందిగామ కార్యదర్శి కె.గోపాల్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నందిగామ కమిటీ సభ్యులు సయ్యద్ ఖాసిం, గోపి నాయక్, లాజర్, సిపిఐ నాయకులు కట్టా చామంతి, అంజిస్వామి పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం నందిగామ డివిఆర్ కాలనీ 17వ వార్డులో ప్రచారభేరి కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజాశక్తి-వన్‌టౌన్ : 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు కొండ ప్రాంతంలో ప్రచారభేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పశ్చిమ నగర కమిటీ కార్యదర్శి బి.సత్యబాబు, నాయకులు పి.రాజు, దుర్గారావు, సత్యారావు, దేవి పాల్గొన్నారు.










