ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చరిత్రపై దాడిని తీవ్రతరం చేసిందని దానిలో భాగంగానే ఆర్‌ఎస్‌ఎస్ భావజాల ప్రతికూల పాఠ్యాంశాలను తొలగిస్తుందని ఎంఎల్‌సి కెఎస్.లక్ష్మణరావు తెలిపారు. రాజమహేంద్రి ఆలోచన వేదిక, యుటిఎఫ్, జెవివి తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పాఠ్యాంశాల తొలగింపు, పూర్వపరాలు, పర్యవసానాలు అనే అంశంపై ఆనం రోటరీ హాల్లో సోమవారం సదస్సు నిర్వహించారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జయకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్‌సిఇఆర్‌టి ఎస్‌సిఆర్‌టి, యుజిసి తదితర పరిశోధనా సంస్థల ప్రత్యేకతను వివరించారు. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, నీట్ వంటి పరీక్షలకు ఎన్‌సిఇఆర్‌టి సిలబస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఫలితంగా అత్యధిక మంది విద్యార్థులు ఆ పాఠ్యపుస్తకాలని అభ్యసిస్తుంటారని వివరించారు. అటువంటి ఎన్‌సిఇఆర్‌టి ఇటీవల పదో తరగతిలో పలు పాఠ్యాంశాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్థులకు సిలబస్ భారమైనందున ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిందని అన్నారు. పదో తరగతిలో డార్విన్ నిర్వచించిన జీవ పరిణామ సిద్ధాంతాన్ని, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించి, 11వ తరగతిలో జమ్మూ కాశ్మీర్ విలీనం, ఆర్‌ఎస్‌ఎస్ నిషేధం, గోద్రాలో జరిగిన అల్లర్లు, డెమొక్రటిక్ పాలిటిక్స్, మొగల్ చక్రవర్తుల చరిత్ర వంటి అంశాలను ప్రస్తావించే పాఠ్యాంశాలను తొలగించారని అన్నారు. వీటన్నిటి వెనుక ఉన్న నేపథ్యాన్ని ఒక్కొక్కటిగా వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి ప్రతికూలంగా ఉన్న పాఠ్యాంశాలను తొలగించారని తెలిపారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వంలో పాఠ్యాంశాల తొలగింపు ప్రక్రియకు ప్రయత్నం జరిగిందని గుర్తు చేశారు. ఆ నిర్ణయం తీసుకున్న కొద్ది కాలానికి ఆ ప్రభుత్వాలు మారాయని అన్నారు. బసవరాజు బొమ్మై ప్రభుత్వం కర్ణాటకలోనూ చేసిన ప్రయత్నాన్ని అక్కడ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి తొలగించిన పాఠ్యాంశాలను పునరుద్ధరిస్తామని ప్రకటించడం స్వాగతించదగిన దన్నారు. భారతదేశ చరిత్ర లౌకిక పునాదులపై ఆధారపడి ఉందని అన్నారు. పలు చరిత్రకారులను ప్రస్తావిస్తూ వారి రచనలను వివరించారు. మోడీ అమిత్ షా నాయకత్వంలో గోద్రాలో జరిగిన హింస మత ఉన్మాదానికి ఒక ఉదాహరణగా చెప్పారు. చరిత్ర అంటే గతాన్ని విశ్లేషించి వర్తమానానికి అన్వయించుకుని భవిష్యత్తును నిర్మించుకోవడం అని అన్నారు. ప్రపంచంలో ఏ సమస్య పరిష్కారానికైనా తొలుత చరిత్రను తెలుసుకుంటేనే సమస్య పరిష్కార సాధ్యమన్నారు. భారతదేశ చరిత్రను వక్రీకరించేలా బిజెపి ప్రభుత్వం తన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. దీనిలో భాగంగానే విద్యార్థుల పాఠ్యాంశాల తొలగింపు, కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి సినిమాల్లో ప్రోత్సహించి ప్రజల మధ్య మరింత విభజన పెంచేలా వ్యవహరిస్తుందన్నారు. స్వాతంత్ర ఉద్యమం స్ఫూర్తిని ఈ సందర్భంగా వివరించారు. కుల మతాలకు అతీతంగా ఐక్యంగా జరిగిన ఈ పోరాటాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించిన విభజించు- పాలించు అనే నినాదాన్ని ప్రస్తుత బిజెపి ప్రభుత్వం అనుసరిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఐసి యూనియన్ ఆలిండియా నాయకులు సతీష్, నాయకులు పిఎస్‌ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.










