ఎ.పి, తెలంగాణలలో ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో తెలంగాణ లోని రెండు పట్టభద్రుల నియోజక వర్గాలనూ టిఆర్‌ఎస్ కైవశం చేసుకుంది. ప్రస్తుత ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర రెడ్డి, పి.వి కుమార్తె వాణీదేవి విజయం సాధించారు. అయితే అదేమీ సునాయాసంగా జరగలేదు. అందుకు చాలా ప్రాధాన్యతా దశలు దాటవలసి వచ్చింది. తొలగింపుల అవసరం పడింది. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్‌నగర్‌లో ప్రస్తుత బిజెపి ఎంఎల్‌సి రామచంద్రరావుకూ, నల్గొండ వరంగల్, ఖమ్మంలో జర్నలిస్టు తీన్మార్ మల్లన్నకూ దగ్గర దగ్గరగా ఓట్లు వచ్చాయి. హైదరాబాదులో ప్రొఫెసర్ నాగేశ్వర్, మరోచోట ప్రొఫెసర్ కోదండరాంలు కూడా బాగా ఓట్లు తెచ్చుకున్నారు. అంతిమంగా బిజెపి సీటు టిఆర్‌ఎస్ గెలుచుకుని, దీనితోపాటు తన పాత స్థానం నిలబెట్టుకుంది. బిజెపి వున్న సీటు పోగొట్టుకోవడమే గాక పోటీ చేసిన మరో చోట వారి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి చాలా వెనకబడిపోయారు. దుబ్బాక, జిహెచ్‌ఎంసి తర్వాత తెలంగాణలో గద్దెక్కడమే తరువాయి అని హడావుడి చేస్తున్న బిజెపి కి ఇది పెద్ద దెబ్బ. రేపు జరగబోయే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక లోనూ బిజెపి కి సరైన అభ్యర్థి ఎంపికే గగనమైన పరిస్థితిలో విజయం సాధించడమనే ఊసే వుండదు. మరోవైపున చూస్తే గతంలో తెలంగాణ జెఎసి చైర్మన్‌గా అన్నీ నడిపించిన కోదండరామ్ తీన్మార్ మల్లన్న కన్నా బాగా వెనకబడి పోయారు. ప్రభుత్వ వ్యతిరేకత హైదరాబాదులో బిజెపి అభ్యర్థికీ అక్కడ మల్లన్నకూ కలసి వచ్చిందని ప్రొఫెసర్ నాగేశ్వర్ అంచనా వేశారు. ఆయన వరకూ గతంలో వచ్చిన నిష్పత్తి లోనే ఓట్లు వచ్చినా ఈ కారణం వల్లనే మూడో స్థానానికి వెళ్లినట్టు కనిపిస్తుంది. బిజెపి కూడా టిఆర్‌ఎస్‌పై గాక తనపై దాడి కేంద్రీకరించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడి వుండొచ్చని ఆయనే అన్నారు. ఆయనకు టిఆర్‌ఎస్ మద్దతు వుందనేది చాలా కాలం పాటు బిజెపి చేసిన దుష్చ్రచారం. లౌకిక విధానాల కోసం మాట్లాడతారనే కోపంతో వేసిన నిందలు మరికొన్ని. తీరా ముఖ్యమంత్రి కెసిఆర్ వాణీదేవిని అభ్యర్థిగా ప్రకటించడమే గాక గట్టి ప్రచార వ్యూహంతో పాలక వర్గాలకు అలవాటైన పద్ధతులతో రంగం లోకి దిగి గెలిపించుకున్నారు.
కోదండ, రామచంద్ర గెలవాల్సిందా?
ఇదీ స్థూలంగా శాసనమండలి ఎన్నికల ఫలితాల తీరు. కనుక ఏ విధంగా చూసినా ఇది కేంద్రంలో పాలన వెలగబెడుతూ మతతత్వ రాజకీయాలతో నిరంకుశ పోకడలతో చెలరేగిపోతున్న బిజెపి వ్యతిరేక తీర్పు, అదే సమయంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైనా ఖచ్చితమైన వ్యతిరేకత పెరుగుతున్నదని హెచ్చరించిన విజయంతో కూడిన తీర్పు. కాని నిన్న ఈ రోజు రెండు పత్రికలలో ఈ ఫలితాలపై వచ్చిన పాక్షిక విశ్లేషణలు అవాస్తవికంగానే గాక అభ్యంతరకరంగానూ వున్నాయి. పట్టభద్రులయితే మాత్రం కొమ్ములుంటాయా అని ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్ బిజెపి అభ్యర్థి గెలవలేకపోయినందుకు విచారించడం, కోదండరాం ఓటమికి తెలంగాణ సమాజాన్ని తప్పు పట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. గతంలోనూ చాలా సార్లు ఆయన పరోక్షంగా బిజెపి పెరుగుదలకు సాకులు సమకూర్చడం, అందుకు ఇతరులే కారకులుగా ఇతర పార్టీలపై తన శైలిలో నిందారోపణలు చేయడం జరుగుతూ వస్తున్నది. పైగా ప్రజా ఉద్యమాలను, ప్రత్యామ్నాయ శక్తుల పోరాటాలను తక్కువ చేసే చాలా వ్యాఖ్యలు అలవోకగా దొల్లించుతూ బిజెపికి మాత్రం ఎక్కడ లేని మినహాయింపులు ఇవ్వడంలో ఔచిత్యం కూడా అర్థం కాదు. అశ్వమేధం తర్వాత రాజసూయం వంటి వ్యాసాల నుంచి దుబ్బాక జిహెచ్‌ఎంసి సమీక్షలు ఏవి తీసుకున్నా ఇదే ధోరణి. టిఆర్‌ఎస్ పాలనపై ఆయన విమర్శలు సహేతుకమైనా ఆ పేరుతో బిజెపి విజయాలకు సాకులు సమకూర్చవలసిన అవసరం ఏమిటో ఇతర లౌకిక వామపక్షాలపై ఆరోపణలు చేసి వారిని దోషులుగా నిలపాల్సిన అగత్యం ఏమిటో అర్థం కాదు. ప్రధాని మోడీతో సహా బిజెపి నాయకత్వం తమపై పెరుగుతున్న వైముఖ్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని తంటాలు పడుతున్నదీ కనిపిస్తూనే వుంది. అయినా సరే వారు అప్రతిహతంగా దూసుకుపోతున్నట్టు, ఇతరులకు ఠికాణా లేకుండా పోయినట్టు ఈయన రాస్తుంటారు. తెలంగాణలో కమ్యూనిస్టులకు కార్యకర్తలే దొరకడం లేదట! ఎన్నికల విజయాలు సాధించలేకపోతున్నారు ... ప్రభావం పరిమితమై పోతుందంటే అది వేరు గాని అసలు కమ్యూనిస్టులకు తప్ప కార్యకర్తలనే వారు ఖచ్చితమైన ఉద్యమాల ఎజెండా మరెవరికి వుండో ఆయన చెబితే బాగుండేది. ఒక వేళ అభ్యుదయ శక్తుల శ్రేయోభిలాషిగా చెబుతున్నారని అనుకుంటే బిజెపి విషయంలో వంకరటింకరగానూ నిందాస్తుతి లానూ చెప్పే సంపాదకులు కమ్యూనిస్టులు ఇతర పార్టీలపై మాత్రం నిరాధార నిందలు ఎందుకు సూటిగా దాడి చేేస్తున్నట్టు? ఇందుకు చాలా ఉదాహరణలు ఇవ్వొచ్చు.
సమాజానిదే తప్పు?
గురువారం ఆయన రాసిన ఆణిముత్యాలు కొన్ని... దక్షిణాదిలో బిజెపికి చలామణి తక్కువనేది బడాయి పరిశీలనట. కేరళలో ఈసారి ఎల్‌డిఎఫ్ తిరిగి వస్తుందనే సర్వేలు చెబుతున్నా ఆ తర్వాత తర్వాత బిజెపి తప్ప వేరే దిక్కు వుండదట. పురోగామి ప్రాంతాలలో కట్టుబాటు సడలిపోయి శిథిలమవుతున్నదట. అసలు చదువుకున్న వాళ్లకే వివేకం లేకుండా పోయిందట. దానికి నిదర్శనం ఏమంటే విద్యాధికులు ప్రభుత్వ వ్యతిరేకంగా వుంటారనే భావనకు అనుగుణంగా కోదండరాంనూ రామచంద్రరావును గెలిపించకపోవడమట. నాగేశ్వర్ కాకపోతే రెండవ స్థానం దాకా వచ్చిన రామచంద్రరావునే గెలిపించి వుండాలట. ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే గాక గట్టిగా ప్రశ్నించేవారట. వాస్తవానికి సరిగా ప్రశ్నించలేదని పని చేయలేదని ఆయనపై బిజెపి లోనే అసంతృప్తి ప్రచారం జరిగిన ముచ్చట సంపాదక ప్రముఖులకు తెలియకపోవడం విచిత్రమే. ఇంతకూ ఈ మొత్తంలో ఎక్కడా బిజెపి మతతత్వ ప్రచారాల పరాకాష్ట గురించి మాత్రం ప్రస్తావించకపోవడం మరీ విడ్డూరం. తీన్మార్ మల్లన్నకు బాగా ఓట్లు వచ్చిన నేపథ్యంపై పరిశీలన జరపాలట. ఆయన తీవ్ర విమర్శల వల్లనే ఓట్లు తెచ్చుకున్నారనేది నిజమైతే కోదండ, రామచంద్రలు ఎందుకు ఓడిపోయారని ఈయన ఆక్షేపణ. ఈ మొత్తం తర్కం ఎంత గజిబిజిగా వైరుధ్యభరితంగా వుందో ఈ వ్యాఖ్యానం ఎవరి గురించి విచారిస్తున్నదో తెలుసుకోవడం పెద్ద సమస్య కాదు. ఇంత రాసిన శ్రీనివాస్ తెలంగాణ సమాజం ప్రభుత్వంపై విమర్శను కోరుకోవడం లేదని తేల్చిపారేశారు. తమాషా ఏమంటే బిజెపి కూడా జాతీయంగా పాలక పార్టీ అనీ దానిపైనా వ్యతిరేకత వుండొచ్చనీ, ప్రజాస్వామ్య లౌకిక విలువలు మతసామరస్యం కోరేవారు దాన్ని ప్రత్యేకంగా వ్యతిరేకించాలని ఆయన గుర్తించలేకపోయారు. విద్యాధికులు ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదని తప్పు పట్టిన సంపాదకులు ఇంత విజ్ఞత కలిగిన తాము బిజెపి ఓటమిని ఎందుకు హర్షించలేకపోతున్నారు? ఏ తర్కంతో రామచంద్రరావు విజయాన్ని కోరుకున్నారు? అన్నట్టు ఈయన ఇంతగా నెత్తికెత్తుకున్న కోదండరాం గాని, ఆఖరుకు తీన్మార్ మల్లన్న గాని బిజెపిని ఎక్కడా రాజకీయ ప్రత్యర్థిగా భావించి విమర్శించకపోవడం యాదృచ్ఛికం కాదు. టిఆర్‌ఎస్ తప్పిదాలపై పోరాడే పేరిట దేశాన్ని ఆవరించిన మతతత్వ నిరంకుశత్వ పోకడలను చూడకపోవడం ఏమి వాస్తవికత? పట్టభద్రులకే కాదు, సంపాదకులకూ కొమ్ములుండవని దీంతో తేలిపోతున్నది. అది భాషా భావ పద విన్యాసాలతో దాచలేని పరమసత్యం.
అంతా గులాబీ భజనేనా!
ఇక దీనికి సమాధానంగా శుక్రవారం నమస్తే తెలంగాణలో మరో శ్రీనివాసుడు-కల్లూరు శ్రీనివాసరెడ్డి పట్టభద్రులకు కొమ్ములున్నాయి అంటూ రాసిన వ్యాసం తోక ముక్క మరో విపరీతం, ఒక పార్టీ పట్ల (అంటే టిఆర్‌ఎస్ పట్ల) ఆ సంపాదకుడికి భిన్నమైన భావజాలం కావచ్చు గాని దాన్ని అందరిపైనా రుద్దడమేమిటని ఈయన ప్రశ్నించారు. ప్రభుత్వం మంచి చేసినా పట్టభద్రులు ఓడించాలని చెప్పడం పొరబాటని హితబోధ చేశారు. బాగానే వుంది గాని స్వతంత్రులు కూడా అన్ని ఓట్లు తెచ్చుకున్నారంటే వాస్తవంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే అత్యధికంగా వున్నాయని, సాంకేతికంగానే సర్కారు అభ్యర్థులు గట్టెక్కారని ఒప్పుకోవడం సమంజసం. ఇక పోతే ఈ శ్రీనివాసుడు కూడా మండలి స్థానాల ఫలితాన్ని ప్రభుత్వ భజనకు ఉపయోగించుకున్నారే తప్ప కేంద్ర విధానాలను, బిజెపి మత రాజకీయాలను విమర్శనాత్మకంగా చెప్పిందేమీ లేదు. ఇది బహుశా టిఆర్‌ఎస్ రాజకీయ ఝంఝాటంలో భాగమే కావచ్చు. తెలంగాణ సమాజంలో పెరిగిన నిరాసక్తతకూ నిరసనకూ కారణాలేమిటనే చీమ తలకాయంత ఆత్మ విమర్శ కూడా ఇందులో లేకపోవడం విచారకరం. గతంలో బిజెపి హడావుడి చేస్తే ఇప్పుడు మా వంతు అన్నట్టే మొత్తం వ్యాఖ్యానం నడిచింది.
అతీతశక్తి కాదు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, బెంగాల్ ఏ రాష్ట్రమైనా సరే... దోపిడీ వర్గాలకు కొమ్ము కాసే పార్టీలు అధికారంలో వున్నచోట...ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఉల్లంఘించి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడటం పరిపాటి. ఈ వ్యవస్థలో ఎన్నికల అక్రమాలు ప్రలోభాలు కూడా అందులో భాగమే. ఇందుకు ఒక రాష్ట్రం ప్రాంతం మినహాయింపుగా అతీతంగా వుంటుందని మాన్య సంపాదకులొకరు అనుకోవడం మొదటి పొరబాటు. రాష్ట్రంలోనే తలదూర్చి దేశాన్ని చూడలేకపోవడం మరింత గ్రహపాటు. అటూ ఇటూ తిప్పి చెబుతూ అసలైన పాఠాలు ప్రజలకు అందకుండా చేయడం ఇలాంటి వారి అలవాటు. చెప్పగలిగింది, చెప్పవలసింది ఒక్కటే- పట్టభద్రులకూ సంపాదకులకూ కూడా కొమ్ములుండవు. కమ్ముకు వచ్చే దుష్ప్రభావాల నీలి నీడలే వుంటాయి. వాటిని సూటిగా ఒప్పుకోకుండా డొంకతిరుగుడు వంకర టింకర వాదనలు చేస్తే ఇలాగే పరిణమిస్తాయి. నిరంతరం విప్లవ పదోచ్ఛారణ చేస్తూనే ఆ శక్తుల పోరాటాలను, ఉద్యమాలను, ఎదురీతను అపహాస్యం చేయడానికి బిజెపి విజయాలు కోరుకోవడానికి దారితీస్తాయి. బిజెపికి ఎల్లలు లేకుండా పోయాయని ఈ సంపాదకుడు పదేపదే వెలిబుచ్చుతున్న అభిప్రాయం ఇప్పటికే తప్పని రుజువైంది. అయినా అదే పట్టుకు వేళ్లాడితే మార్చుకోక తప్పదు కూడా.
అసలు ఉపాధ్యాయులు, పట్టభద్రులు అంత నిస్తేజంగా లేరు. ఇదే ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో యుటిఎఫ్ అభ్యర్థి సాబ్జీని తొలి లెక్కింపు లోనే గెలిపించారు. ఉమ్మడి ఎ.పి లోనూ విభజన తర్వాత కూడా పిడిఎఫ్ ఒక ప్రధాన శక్తిగా వుంటోంది. అంతకు ముందు జనసంఫ్‌ు, బిజెపి ఎక్కువ ఎంఎల్సీ లు తెచ్చుకునే స్థితి మారింది. తెలంగాణ మండలిలోనూ ఇప్పుడు యుటిఎఫ్ నర్సిరెడ్డి వున్నారు. కనుక కొమ్ములు వున్నా లేకున్నా విద్యాధికులు విచక్షణతో ఓటేస్తున్నారు. బిజెపి ని గెలిపించనందుకు వారిని తిట్టిపోయడం అనుచితం.
* తెలకపల్లి రవి










