ప్రజాశక్తి- చింతూరు
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం గడిచిన తొమ్మిదేళ్లగా దేశ సంపదలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని, మరో వైపు మతం పేరుతో విధ్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య చీలికలు తెస్తుందని, బిజెపి నుండి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్ అన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మే 4న చింతూరులో జరుగు బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను గురువారం సిపిఎం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగకు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్, సిపిఐ జాతీయ నాయకులు రావూరి వెంకయ్య, రెండు పార్టీల జిల్లా నాయకులు ప్రసంగిస్తారని, చింతూరు డివిజన్ 4 మండలాల ప్రజానీకం వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కుంజా సీతారామయ్య, పల్లపు వెంకట్, ఎర్రంశెట్టి, శ్రీనివాస్, పోడియం లక్ష్మణ్, తెపల్లె లక్ష్మయ్య, సలీమ్ పాల్గొన్నారు.
మోతుగూడెం : చింతూరు మండలం తులసిపాక గ్రామంలో సిపిఎం ఆధ్వర్యాన ప్రచార భేరి నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాస్, పల్లపు వెంకట్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకింగ్, ఎల్‌ఐసి, రైల్వే, రక్షణ, స్టీల్‌ప్లాంట్, విమానాశ్రయాలు, బొగ్గు గనులు, వాడరేవులు అన్నిటిని చౌకగా కార్పొరేటర్లకు ధారాధత్వం చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విధానాలకు రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు వత్తాసు పలకడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో, మల్లేష్, లక్ష్మయ్య, ముత్తయ్య, దుర్గారావు, తమ్మయ్య, చిన్న కనకయ్య పాల్గొన్నారు.
విఆర్.పురం : మండలంలోని చిన్నమట్టపల్లి పంచాయితీ పరిధి చింతరేగుపల్లి గ్రామంలో ప్రచార భేరి కార్యక్రమం సిపిఎం నాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పని ప్రదేశానికి వెళ్లి కూలీలను కలిశారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.150 కూలి వస్తుందని, రూ.600 చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి వికలాంగులకు 50శాతం రాయితీ రావాల్సి ఉందని, వెంటన రాయితీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు వడ్లాది రమేష్, కుంజా నాగిరెడ్డి, కార్యకర్తలు ముత్యాల శివశంకర్, శ్రీరామ్మూర్తి నరసింహారావు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.










