సిపిఎం, సిపిఐ రాజకీయ ప్రచార భేరిలో నేతలు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార భేరి యాత్ర జిల్లాలోని అన్ని మండలాల్లో శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నేతలు ఇంటింటికీ వెళ్లి బిజెపి వైఖరిని ఎండగట్టారు. అనంతరం ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు.
ప్రజాశక్తి - ఏలూరు
బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ప్రమాదం నుండి దేశాన్ని కాపాడుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగా ప్రభాకర్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, సిపిఐ జిల్లా కార్యదర్శి కె.మన్నవకృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. శుక్రవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన చేపట్టిన ప్రచార భేరి యాత్రను వారు ప్రారంభించారు. తొలుత ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం, సిపిఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు సిపిఎం నగర కార్యదర్శి పళ్లెం కిషోర్, సిపిఐ సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ అధ్యక్షత వహించారు. ప్రభాకర్, రవి, కృష్ణచైతన్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అదాని, అంబాని వంటి అతి సంపన్నులకు దేశ సంపదను దోచిపెడుతోందని విమర్శించారు. మరోవైపు పేదలపై మోడీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోలు, డీజిల్, కరెంటు ఛార్జీలను మోయలేని విధంగా పెంచి నడ్డి విరుస్తుందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. గ్రామీణ పేదలకు అన్నం పెడుతున్న ఉపాధి హామీ చట్టాన్ని సైతం మోడీ ప్రభుత్వం అటకెక్కిస్తోందని విమర్శించారు. మహిళలకు, దళితులకు, మైనార్టీలకు, గిరిజనులకు దేశంలో రక్షణ లేకుండాపోయిందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్, వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు నిధులు, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ తదితర అనేక అంశాల్లో రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేస్తుందని విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి రాష్ట్రానికి నిధులు రాబట్టాల్సిన వైసిపి ప్రభుత్వం కేంద్రానికి లొంగి వ్యవహరిస్తుందని, ప్రతిపక్షాలైన టిడిపి, జనసేన సైతం బిజెపిని నిలదీయడం లేదని గుర్తు చేశారు. ప్రచార భేరి యాత్రను సిపిఐ నేత డేగా ప్రభాకర్, సిపిఎం నాయకులు బి.సోమయ్య జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ బండి వెంకటేశ్వరరావు, సిపిఎం నేతలు కె.శ్రీనివాస్, పివి.రామకృష్ణ, ఎ.శ్యామలారాణి, కె.విశ్వనాథం, వి.సాయిబాబు, బి.జగన్నాథం, జె.గోపీ, కె.రామాంజనేయులు, విజిఎంఆర్.కృష్ణారావు, సిపిఐ నాయకులు కురెళ్ల వరప్రసాద్, తెర్లాపు శ్రీను, సుబేదార్‌ఖాన్, మావూరి విజయ, అడ్డగర్ల లక్ష్మీఇందిరా, భజంత్రీ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
కుక్కునూరు: దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రతిఒక్కరూ కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందని సిపిఎం మండల కార్యదర్శి యర్రంశెట్టి నాగేంద్రరావు, సిపిఐ మండల కార్యదర్శి మైనాక్షి వెంకటాచారి అన్నారు. ప్రచార భేరి యాత్రను స్థానికంగా శుక్రవారం పోస్టర్లను ఆవిష్కరించి ప్రారంభించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో నాగేంద్రరావు, వెంకటాచారి మాట్లాడారు. కార్యక్రమంలో ఇరు పార్టీల నేతలు కొన్నె లక్ష్మయ్య, కూరాకుల బాబూరావు, సోడె నాగేష్, వరసా నాగేశ్వరరావు, మారయ్య, కణితి రాము, పూరెం లక్ష్మయ్య, మహాబూబ్ పాషా, పట్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
పోలవరం: అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రచార భేరి కార్యక్రమం ప్రారంభించామని సిపిఎం మండల కార్యదర్శి గుడెల్లి వెంకట్రావు, నేత బొరగం భూచంద్రరావు తెలిపారు. కార్యక్రమంలో నేతలు మిడియం గంగాదేవి, కుంజం మంగ తదితరులు పాల్గొన్నారు.
కామవరపుకోట: మోడీ పాలనలో అన్ని తరగతుల ప్రజలు ఇబ్బందుల్లో పడ్డారని సిపిఐ మండల కార్యదర్శి టివిఎస్.రాజు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం.జీవరత్నం ఆందోళన వ్యక్తం చేశారు. 'ప్రజా వ్యతిరేక, నిరంకుశ మతోన్మాద బిజెపిని సాగనంపుదాం.. దేశాన్ని కాపాడుదాం' అనే నినాదంతో శుక్రవారం కామవరపుకోటలో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన ప్రచార భేరి నిర్వహించారు. తొలుత సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఊటి ప్రచార భేరి ప్రారంభించారు. కామవరపుకోట, జీలకర్రగూడెం, కళ్లచెరువు, రత్నగిరినగర్, తడికలపూడి, ఆడమిల్లి ఈస్ట్, యడవల్లి, రామన్నపాలెం, రావికంపాడు తదితర గ్రామాల్లో జరిగిన సభల్లో నేతలు మాట్లాడారు. కార్యక్రమంలో ఇరు పార్టీల నేతలు బి.రాంబాబు, ఎ.ప్రభాకర్, పి.సూర్యారావు, ఎస్‌కె.సుభాషిణి, ఎ.ఫ్రాన్సిస్, బుచ్చిబాబు పాల్గొన్నారు.
టి.నరసాపురం: కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి చరమగీతం పాడాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు బిఎన్.సాగర్, సిపిఎం మండల కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ పిలుపునిచ్చారు. సిపిఐ, సిపిఎం ఆధ్వర్యాన ప్రచార భేరి యాత్రను శుక్రవారం సిపిఐ మండల కార్యదర్శి సాకా గంగరాజు ప్రారంభించారు. తొలుత చిన్నగుర్వాయిగూడెంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో తాడిగడప జయరాజు, వీరంకి వెంకట్రావు. పోలగాని సత్యనారాయణ, బాబూరావు పాల్గొన్నారు.
ఉంగుటూరు: బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి దేశాన్ని, ప్రజలను రక్షించుకోవడం కోసం సిపిఎం, సిపిఐ ప్రచార భేరిని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.లింగరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం చేబ్రోలులోని ప్రజాసంఘాల కార్యాలయంలో కె.వెంకట్రావు అధ్యక్షతన ఉంగుటూరు నియోజకవర్గ సమావేశం జరిగింది. లింగరాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం, సిపిఐ ఈ నెల 14 నుంచి 30 వరకు రాజకీయ ప్రచారభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నాయని, దీనిలో భాగంగా నియోజకవర్గంలో ఈ నెల 17, 18 వ తేదీల్లో జరిగే కార్యక్రమంలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నేతలు సీరా అప్పారావు, నక్క సుబ్బారావు, నారపల్లి రమణారావు, కట్టా భాస్కరరావు, కోన శ్రీనివాసరావు, శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.
వేలేరుపాడు: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిఒక్కరూ పోరాటం చేయాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎమ్‌డి.మునీర్ పిలుపునిచ్చారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార భేరి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సిపిఐ మండల కార్యదర్శి బాడిశ రాము అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మునీర్ మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ధర్ముల రమేష్, ఇరు పార్టీల నేతలు మడివి దుర్గారావు, కారం ధారయ్య, యర్రా మధు, వంగపండు రాంబాబు, కారం వెంకట్రావు, గుమ్మల నర్సయ్య పాల్గొన్నారు.










