Apr 23,2023 23:41

సుంకరమెట్ట వారపు సంతలో ప్రచారం చేస్తున్న సీపీఎం నాయకులు.

ప్రచారభేరి పాదయాత్రలో సిపిఎం నేతలు
విఆర్‌.పురం
: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆదివారం మండలంలోని రేఖపల్లి పంచాయతీ ముమ్మిడివరం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రచారభేరి పాదయాత్ర నిర్వహించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ, కరపత్రాలను పంచి, బిజెపి విధానాలపై ప్రజలకు వివరించి చైతన్యపరిచారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో సత్యనారాయణ మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి నిధుల కోత పెట్టి, పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. పనిప్రదేశంలో టెంట్లు, తాగునీరు వైద్య సౌకర్యాలు కల్పించాలని, గునపాలు, పారలు వంటి ఉపాధి పనిముట్ల అందించాలని, ఉపాధి కూలీలకు వేసవి బోనస్‌ అందించాలని కోరారు.
ముమ్మిడివరం గ్రామాన్ని 41.5 కాంటూరులో చేర్చి, అటవీశాఖ ఆగడాలను అరికట్టాలని, సాగుభూములకు పోడుపట్టాలు ఇవ్వాలని కోరారు. బోయ/వాల్మీకి, బెంతుఒరియాలను ఎస్‌టి జాబితాలో చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఆమోదించకుండా తిప్పిపంపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం శాఖ సెక్రటరీ కురసం నాగేశ్వరరావు, చిక్కాల గ్రామస్తులు పాల్గొన్నారు
4న 'చలో చింతూరు' వాల్‌ పోస్టర్లు ఆవిష్కరణ
ఎటపాక : మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వచ్చేనెల 4న చింతూరులో నిర్వహించే బహిరంగ సభ జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు కందుకూరి స్వర్ణ కోరారు. ఆదివారం గన్నవరం గ్రామంలో సిపిఐ, సిపిఎం జిల్లా, మండల నాయకులు ఆధ్వర్యంలో చింతూరు బహిరంగసభ వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. బహిరంగసభకు చింతూరు, వి.ఆర్‌.పురం, కూనవరం, ఎటపాక మండలాల నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రచారభేరిలో భాగంగా గ్రామాల్లో కరపత్రాలు, వాల్‌పోస్టర్లను ఆవిష్కరిస్తూ, ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు, గన్నవరం ఎంపిటిసి కంటెరాజు, సిపిఎం ఎటపాక మండల కార్యదర్శి ఐవి., సిపిఐ జిల్లా నాయకులు వాసం రాము, సిపిఎం ఎటపాక మండల నాయకులు ఆకిశెట్టి రాము, సోందె రామారావు, సిపిఐ నాయకులు వల్లభనేని సత్యనారాయణ పాల్గొన్నారు.
మోడీని గద్దెదించండి
అరకులోయ రూరల్‌: మతోన్మాద బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం సుంకరమెట్ట వారపు సంతలో ప్రచార బేరి జీపు జాతలో భాగంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు, మండల నాయకులు పొద్దు బాలదేవ్‌, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వివి జయ మాట్లాడారు.మోడీని అధికారం నుండి గద్దెదించి దేశ సంపదను కాపాడాలని పిలుపునిచ్చారు. గిరిజన చట్టాలు, హక్కులను బిజెపి ప్రభుత్వం కాలరాస్తుందని తెలిపారు. .నూతన అటవీ పాలసీ విధానం తీసుకొచ్చి గిరిజనులను అడవి నుండి గెంటివేయాలని ప్రయత్నం చేస్తుందని, తక్షణమే ఈ విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.మత విద్వేషాలను రెచ్చగొట్టి దేశంలో మూడోసారి అధికారంలో రావాలని ప్రయత్నిస్తుందని అన్నారు. విశాఖ స్టీల్‌, రైల్వే, బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు బిజేపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు పాంగి రామన్న, బుజ్జి బాబు, కె.బుజ్జిబాబు, జోషి, అప్పన్న, నానిబాబు, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.