Nov 06,2023 21:37

వాగ్వాదం చేసుకుంటున్న బిజెపి నాయకులు

        పుట్టపర్తి అర్బన్‌ : శ్రీ సత్యసాయి జిల్లాలో బిజెపి నేతల మధ్య వర్గపోరు బహిర్గం అయ్యింది. రాష్ట్ర అధ్యక్షురాలు పరంధేశ్వరి రాక సందర్భంగా ఆ పార్టీ నాయకులు బాహాబాహికి దిగారు. బిజెపి బలోపేతానికి నాయకులకు దిశా నిర్దేశం చేయడానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్ని జిల్లాలోనూ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం పుట్టపర్తికి విచ్చేశారు. జానకి రామయ్య కళ్యాణ మండపానికి పురంధేశ్వరి మరో 15 నిమిషాలకు చేరుకుంటున్న సమయంలో కదిరి నియోజకవర్గానికి చెందిన ఇద్దరు బిజెపి నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాజీ జిల్లా అధ్యక్షుడు వజ్రా భాస్కర్‌ రెడ్డి, ఆ పార్టీ నాయకుడు గుడిసె దేవానంద్‌లు ఇద్దరూ ఘర్షణ పడ్డారు. 'నువ్వెంత అంటే.. నువ్వెంత' అంటూ ఒకరిపై ఒకరు దూషణలు చేసుకున్నారు. ఒక సందర్భంలో ఇద్దరూ కొట్టుకునే స్థాయి వరకు వెళ్లారు. జిల్లా అధ్యక్షుడు జిఎం.శేఖర్‌ ఇతర ముఖ్య నాయకులు కలుగజేసుకుని గొడవను సద్దుమణిగే విధంగా చర్యలు తీసుకున్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షురాలు సభా వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే నేతల మధ్య ఘర్షణ విషయాన్ని జిల్లా నేతలు ఎవరూ ఆమె వద్ద ప్రస్తావించలేదు. అనంతరం పరంధేశ్వరి బిజెపి నాయకులతో సమావేశం నిర్వహించి, దిశానిర్ధేశం చేశారు.