
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : లౌకిక రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, సామాజిక న్యాయానికి సమాధి కడుతున్న బిజెపి మతోన్మాత విధానాలను ప్రతి ఘటించా లని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి. పవన్ కుమార్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు చీకటి రాజేష్ పిలుపునిచ్చారు. దళిత హక్కుల రక్షణ, సామాజిక న్యాయం సాధనకు ఈనెల 29న విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ధర్నాకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు. ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్లను మగ్గాల కాలనీ అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 76 ఏళ్లు గడుస్తున్నా దళితులు, గిరిజనులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం లౌకిక రాజ్యాంగానికి తూట్లు పొడిచి మనువాదాన్ని నెత్తికెత్తుతుందన్నారు. అనాగరిక కాలం వైపు సమాజాన్ని నడిపిస్తున్నదని విమర్శించారు. వారి అడుగులకు మడుగులు ఒత్తుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితులపై దాడులు చేసిన వారికి వత్తాసుగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల ఓట్లు పొందుతూ వారి బతుకులలో నిప్పులు పోస్తున్నారన్నారు. అనేక పోరాటాలతో సాధించుకున్న ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను మరోక పథకానికి మరలించి దళిత గిరిజనులకు తీవ్ర అన్యాయాన్ని తలపెట్టారన్నారు. దళితుల్లో చదువుకున్న నిరుద్యోగులు రోజురోజుకీ పెరుగుతున్నారని తెలిపారు. లక్షలాది ఎస్ సి, ఎస్టి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 9/77 అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించి దళితుల భూములు అన్య క్రాంతం అయ్యేందుకు మార్గాలు ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.శర్మ, పట్టణ కార్యదర్శి పి. రాజు పట్టణ కమిటీ సభ్యులు జి పురుషోత్తం, పి వేణు, కె భాను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సిహెచ్ జయరావు, ఏ. సతీష్ సువర్ణ రాజు పాల్గొన్నారు.