ప్రజాశక్తి-ఆదోనిరూరల్
బిజెపి మతోన్మాత రాజకీయాలతో ఆర్థిక వ్యవస్థ నాశనమవుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కె.వెంకటేశులు మండిపడ్డారు. దేశాన్ని తాకట్టు పెట్టే విధంగా బిజెపి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తోందని విమర్శించారు. బుధవారం మండలంలోని పాండవగల్ గ్రామంలో శ్రీపాతూరి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర కోసిగి, పెద్దకడబూరు, కౌతాళం మండలాల పార్టీ సభ్యులకు రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. మండల కార్యదర్శి కె.లింగన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వెంకటేశులు మాట్లాడారు. దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలను ఐక్యం చేసి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న పార్టీ సిపిఎం అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ మైనార్టీలు, ముస్లింలపై దాడులు తీవ్రం చేస్తోందని తెలిపారు. ఈ మతతత్వ విధానాలను తిప్పికొట్టేందుకు సిపిఎం కార్యకర్తలు సన్నద్ధం కావాలని కోరారు. ఈ తరగతులకు సిపిఎం సీనియర్ నాయకులు మల్లయ్య ప్రిన్సిపల్‌గా వ్యవహరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కెవి.నారాయణ, సిపిఎం పెద్దకడబూరు మండల కార్యదర్శి తిక్కన్న, కోసిగి మండల కన్వీనర్ రాముడు, కౌతాళం మండల కన్వీనర్ ఎం.ఈరన్న, ఆదోని మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి.వీరారెడ్డి పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న వెంకటేశులు










