పార్వతీపురంటౌన్: బిజెపి మతోన్మాద పాలనకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడే సమయం ఆసన్నమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అన్నారు. తొలుత స్థానిక బస్టాండ్ నుంచి నాలుగు రోడ్ల జంక్షన్ వరకూ ర్యాలీగా వచ్చి గాంధీ విగ్రహానికి వేణు పూలమాలవేశారు. అక్కడి నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్ వరకు మతసామరస్యం, బిజెపి ప్రజాసామిక హక్కులపై దాడి, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని నినాదాలు చేస్తూ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెడ్డి వేణు మాట్లాడుతూ బిజెపి మతోన్మాద మోడీ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా గాంధీ జయంతి నుంచి నవంబర్ 7 వరకు సిపిఎం ప్రజారక్షణ భేరి యాత్రలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్య హక్కులు, దేశ, ప్రజా రక్షణకు మరో చారిత్రాత్మక పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మోడీ వత్తాసుతోనే జగన్ ప్రజలపై భారాలు మోపుతున్నారని, అడ్డగోలు పాలన సాగిస్తున్నాడని మోడీని ఓడిస్తేనే జగన్ పాలన అంతమవుతుందని చెప్పారు. టిడిపి పతనమే బిజెపి లక్ష్యమన్న వాస్తవాన్ని గుర్తించకుండా మోడీ వెంటపడుతోందని విమర్శించారు. అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను బిజెపి మింగేసిందన్నారు. కేంద్రం వత్తిడికి తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అనేక రూపాల్లో విద్యుత్ భారాలు మోపుతోందని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.మన్మధరావు, వి.ఇందిర, జిల్లా కమిటీ సభ్యులు జి.వెంకటరమణ, రెడ్డి శ్రీదేవి, కె.సాంబమూర్తి, పట్టణ నాయకులు బి.సూరిబాబు, పి.సన్యాసిరావు, తులసి, వరలక్ష్మి, బి.వెంకటరమణ, రెడ్డి ఈశ్వరరావు, జి.వెంకటరమణ, రామారావు, వెన్నెల వేణు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










